బీహార్‌లో జీపుపై రాహుల్ యాత్ర.. డ్రైవర్‌గా తేజస్వీ యాదవ్

  • బీహార్‌లోని ససారమ్‌లో రాహుల్ భారత్ జోడో న్యాయ్ యాత్ర
  • తేజస్వీ డ్రైవ్ చేస్తుంటే పక్కన కూర్చొని ముచ్చట్లు చెప్పిన రాహుల్
  • ఎక్స్‌లో వీడియో షేర్ చేసిన బీహార్ మాజీ డిప్యూటీ సీఎం
  • ముఖ్యమంత్రి నితీశ్ కుమార్‌పై నిప్పులు చెరిగిన తేజస్వీ
బీహార్‌లోని ససారమ్‌లో జరుగుతున్న రాహుల్‌గాంధీ ‘భారత్ జోడో న్యాయ్ యాత్ర’లో ఆకర్షించే ఘటన ఒకటి జరిగింది. బీహార్‌లో చివరి రోజు జరుగుతున్న యాత్రలో రాహుల్ జీపులో ప్రయాణిస్తే, బీహార్ మాజీ ఉప ముఖ్యమంత్రి తేజస్వీ యాదవ్ డ్రైవ్ చేశారు. తేజస్వీ డ్రైవ్ చేస్తుంటే పక్కనే కూర్చున్న రాహుల్ ముచ్చటిస్తున్న వీడియోను తేజస్వీ తన ఎక్స్ ఖాతాలో షేర్ చేశారు. మరో వీడియోలో ఎస్‌యూవీ రూఫ్‌పై కూర్చుని ప్రజలకు అభివాదం చేస్తూ కనిపించారు.

భారత్ జోడో న్యాయ్ యాత్రలో భాగంగా ససారమ్‌లో తేజస్వీయాదవ్ మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి నితీశ్ కుమార్‌పై నిప్పులు చెరిగారు. ‘‘మన ముఖ్యమంత్రి ఎలాంటి వారో మీ అందరికీ తెలుసు. ఆయన ఏ ఒక్కరినీ పట్టించుకోరు. ప్రజలు చెప్పేది వినిపించుకోరు. నేను చచ్చిపోతాను తప్పితే బీజేపీతో చేతులు కలపనని చెప్పడంతో ఆయనతో ఉండాలని నిర్ణయించుకున్నాం. బీజేపీని ఓడించేందుకు ఎన్ని త్యాగాలైనా చేయాలనుకున్నాం. కానీ మనం పూర్తిగా అలసిపోయిన ముఖ్యమంత్రిని నియమించాం’’ అని విమర్శించారు. 

నేటి మధ్యాహ్నం 3 గంటలకు రాహుల్‌గాంధీ, తేజస్వీ యాదవ్ ఇద్దరూ ఉత్తరప్రదేశ్‌లోని కైమూర్ జిల్లాలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రసంగిస్తారు. అంతకుముందు ఔరంగాబాద్‌ జిల్లాలో జరిగిన ర్యాలీలో రాహుల్ మాట్లాడుతూ ఆందోళన తెలుపుతున్న రైతులకు మద్దతు ప్రకటించారు. దేశం కోసం సరిహద్దుల్లో పోరాడుతున్న సైనికులతో రైతులను పోల్చారు.


More Telugu News