‘రాజధాని ఫైల్స్’ విడుదలకు ఏపీ హైకోర్టు గ్రీన్ సిగ్నల్

  • సెన్సార్ సర్టిఫికెట్లు, రికార్డులు సక్రమంగానే ఉన్నాయన్న కోర్టు
  • వైసీపీ నేత పిటిషన్ తో గురువారం స్టే విధించిన న్యాయస్థానం
  • శుక్రవారం విచారించి స్టే ను ఎత్తివేస్తూ ఆదేశాలు
రాజధాని ఫైల్స్ సినిమా విడుదలకు ఏపీ హైకోర్టు శుక్రవారం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. సెన్సార్ సర్టిఫికెట్లతో పాటు అన్ని రికార్డులు సక్రమంగానే ఉన్నాయని పేర్కొంటూ సినిమాను విడుదల చేసుకోవచ్చని పేర్కొంది. గురువారం ఈ సినిమా విడుదలపై విధించిన స్టేను ఎత్తివేసింది. దీంతో సినిమా విడుదలకు నిర్మాతలు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఏపీ సీఎం జగన్ తో పాటు ప్రభుత్వ ఇమేజ్ ను దెబ్బతీసేలా ఉందని ఆరోపిస్తూ రాజధాని ఫైల్స్ సినిమా విడుదలను అడ్డుకోవాలని వైసీపీ నేత లేళ్ల అప్పిరెడ్డి హైకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్ ను విచారణకు స్వీకరించిన హైకోర్టు.. గురువారం సినిమా విడుదలపై స్టే విధించింది. సినిమాకు సంబంధించిన పూర్తి రికార్డులను అందజేయాలని నిర్మాతలను ఆదేశించింది. 

శుక్రవారం విచారణ జరగగా.. ఏపీ ప్రభుత్వ ఇమేజ్ ను దెబ్బతీసేలా ఉన్న ఈ సినిమాపై స్టే కొనసాగించాలని పిటిషనర్ తరఫున న్యాయవాది కోర్టులో వాదనలు వినిపించారు. నిర్మాతల తరపు న్యాయవాది ఉన్నం మురళీధరరావు వాదనలు వినిపిస్తూ... రివిజన్ కమిటీ సూచనల మేరకు పలు సన్నివేశాలను తొలగించినట్లు చెప్పారు. ఆ తర్వాతే తమకు సెన్సార్ బోర్డు సర్టిఫికెట్ ఇచ్చిందన్నారు. డిసెంబర్ లో తమకు సెన్సార్ సర్టిఫికెట్ వస్తే... వైసీపీ ఇప్పుడు హైకోర్టును ఆశ్రయించిందని చెప్పారు. ఈ క్రమంలో సెన్సార్ బోర్డ్ సర్టిఫికేట్‌లు, రికార్డ్‌లను పరిశీలించిన కోర్టు.. అన్నీ సక్రమంగానే ఉన్నాయని పేర్కొంటూ సినిమాను విడుదల చేసుకోవచ్చని అనుమతినిచ్చింది.


More Telugu News