శాటిలైట్ విధ్వంసక ఆయుధాలను అభివృద్ధి చేస్తున్న రష్యా.. అమెరికాలో ఆందోళన

  • శాటిలైట్లను ధ్వంసం చేసే ఆయుధాలను రష్యా అభివృద్ధి చేస్తోందన్న అమెరికా 
  • ఈ పరిణామం ఆందోళనకారకమని వ్యాఖ్య
  • అమెరికా ఆరోపణలను తోసిపుచ్చిన రష్యా
  • ఉక్రెయిన్ యుద్ధసాయం బిల్లును పాస్ చేయించుకునేందుకు గిమ్మికులు చేస్తోందని మండిపాటు
అంతరిక్షంలో ఉపగ్రహ విధ్వంసక ఆయుధాలను రష్యా అభివృద్ధి చేస్తోందన్న వార్తలు అమెరికాలో కలకలం రేపుతున్నాయి. ఈ వార్తలు నిజమేనని అమెరికా పేర్కొంది. ఇది సమస్యాత్మకమేనని శ్వేతసౌధం గురువారం ఓ ప్రకటలో తెలిపింది. అయితే, ఇంకా అభివృద్ధి దశలో ఉన్న ఈ ఆయుధాలతో మానవాళికి వచ్చే ప్రమాదమేమీ లేదని పేర్కొంది. అమెరికా జాతీయ భద్రతకు ముప్పు పొంచి ఉందంటూ కొందరు చట్టసభ సభ్యులు ఆందోళన వ్యక్తం చేసిన నేపథ్యంలో వైట్‌హౌస్ ఈ ప్రకటన చేసింది. 

శాటిలైట్ విధ్వంసక ఆయుధాలు పూర్తిస్థాయిలో సిద్ధం కాలేదని జాతీయ భద్రతా మండలి అధికార ప్రతినిధి జాన్ కర్బీ పేర్కొన్నారు. కానీ, ఈ టెక్నాలజీ అభివృద్ధి కోసం ప్రయత్నించడం ఆందోళనకరమన్నారు. అయితే, ఇది అణ్వాయుధమా లేక అణు ఇంధన ఆధారితమా అనేది మాత్రం ఆయన వెల్లడించలేదు. 

రష్యా ఈ టెక్నాలజీపై దృష్టి సారిస్తే అది 1967 నాటి ఔటర్ స్పేస్ ట్రీటీని ఉల్లంఘించినట్టేనని ఆయన స్పష్టం చేశారు. ఈ ఒప్పందంపై రెండు దేశాలు సంతకాలు చేశాయి. అంతరిక్షంలో అణ్వాయుధ వినియోగాన్ని ఈ ఒప్పందం నిషేధించింది. ఇలాంటి ఆయుధాలతో భూసమీప కక్ష్యలోని వ్యోమగాములకు తీవ్ర ప్రమాదం పొంచి ఉందని ఆయన తెలిపారు. 

అమెరికా ఆరోపణలను తోసి పుచ్చిన రష్యా..
రష్యా మాత్రం అమెరికా ఆరోపణలను తోసిపుచ్చింది. ఉక్రెయిన్‌కు అదనపు యుద్ధ సాయం అందించేందుకు ఉద్దేశించిన బిల్లును కాంగ్రెస్‌లో (అమెరికా చట్టసభలు) పాస్ చేయించుకునేందుకు శ్వేతసౌధం కుయుక్తులు పన్నుతోందని మండిపడింది. 

ఉక్రెయిన్‌కు ఆయుధాలు సమకూర్చేందుకు మరో 60 బిలియన్ డాలర్ల ఆర్థిక సాయం అందించే బిల్లును అమెరికా చట్టసభల్లో పాస్ చేయించుకునేందుకు బైడెన్ ప్రభుత్వం విశ్వప్రయత్నం చేస్తోంది. అయితే, బైడెన్ ప్రయత్నాలను ప్రతిపక్ష రిపబ్లికన్లు అడ్డుకుంటన్నారు. ఈ నేపథ్యంలో ఎలాగైనా బిల్లు పాస్ చేయించుకునేందుకు బైడెన్ ప్రభుత్వం కుయుక్తులు పన్నుతోందని రష్యా ఆరోపించింది. తాము అలాంటి ఆయుధాలు అభివృద్ధి చేయట్లేదని స్పష్టం చేసింది. అమెరికా ఇలాంటి ట్రిక్స్ ఎన్ని ప్లే చేస్తుందో చూస్తున్నామని వ్యాఖ్యానించింది.


More Telugu News