భారతీయులపై వరుస దాడులు.. అమెరికా కీలక ప్రకటన!

  • అమెరికాలో భారత సంతతి వారిపై వరుస దాడులతో ఎన్నారైల్లో ఆందోళన 
  • తమ దేశంలో ద్వేషపూరిత దాడులకు తావు లేదని స్పష్టీకరణ 
  • దాడులను అరికట్టేందుకు దేశాధ్యక్షుడు పలు చర్యలు తీసుకుంటున్నారని వెల్లడి 
అమెరికాలో భారత సంతతి వారిపై వరుస దాడుల నేపథ్యంలో శ్వేతసౌధం తాజాగా స్పందించింది. ఈ దాడులను తీవ్రంగా ఖండించిన అధ్యక్ష కార్యాలయం.. అమెరికాలో జాతివివక్షకు, హింసకు తావు లేదని తేల్చింది. ఈ మేరకు అమెరికా జాతీయ భద్రతా మండలిలోని స్ట్రాటజిక్ కమ్యూనికేషన్స్ విభాగం కోఆర్డినేటర్ జాన్ కర్బీ తాజా మీడియా సమావేశంలో పేర్కొన్నారు. భారతీయులపై దాడులపై విలేకరులు అడిగిన ప్రశ్నలపై ఆయన స్పందించారు. 

జాతి, ప్రాంతం, స్త్రీపురుష భేదాలు సహా మరే ఇతర కారణాలతో జరిగే దాడులైనా క్షమార్హం కాదని జాన్ కర్బీ పేర్కొన్నారు. అమెరికా ప్రభుత్వం ఈ దాడులను ఖండిస్తోందని తెలిపారు. వీటిని అరికట్టేందుకు బైడెన్ ప్రభుత్వం పలు చర్యలు తీసుకుంటోందని తెలిపారు. ఈ దాడుల కారకులకు కఠిన శిక్షలు పడేలా చేస్తామన్నారు. 

వాషింగ్టన్ డీసీలో ఫిబ్రవరి 2న అర్ధరాత్రి జరిగిన దాడిలో 41 ఏళ్ల ఎన్నారై వివేక్ తనేజా దారుణ హత్యకు గురయ్యాడు. దాడిలో తీవ్రంగా గాయపడ్డ అతడు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. షికాగోలో ఫిబ్రవరి 4న మరో ఘటనలో హైదరాబాద్‌కు చెందిన సయ్యద్ మజర్ అలీపై కొందరు దాడి చేసి అతడి ఫోన్, వ్యాలెట్ దోపిడీ చేశారు. అంతకుముందు ఓహాయోలోని సన్సినాటీ నగరంలోని శ్రేయాస్ రెడ్డి అనే వ్యక్తి అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. ఈ మరణం వెనక కారణాలు ఇంకా తెలియరాలేదు. ఇక జనవరి 30న అదృశ్యమైన పర్‌డ్యూ యూనివర్సిటీ విద్యార్థి నీల్ ఆచార్య కూడా మృతి చెందినట్టు బయటపడింది. జార్జియా రాష్ట్రంలోని ఓ షాపులో ఆశ్రయం పొందుతున్న నిర్వాసితుడు జరిపిన దాడిలో షాపు ఉద్యోగి వివేక్ సైనీ కన్నుమూశాడు. ఇలా ఇండియన్లపై వరుస దాడుల కారణంగా అక్కడున్న ఎన్నారైలు కలవరానికి గురవుతున్నారు.


More Telugu News