అమెరికాలో మరో భారతీయ సంతతి వ్యక్తి కాల్చివేత

  • ఓ హోటల్ యజమాని ప్రవీణ్ పటేల్‌ని(76) తుపాకీతో కాల్చి చంపిన కస్టమర్
  • రూమ్ విషయంలో ఇద్దరి మధ్య వాగ్వాదం.. ఆగ్రహంతో కాల్పులు
  • అమెరికాలో భారతీయుల మరణాలు పెరిగిపోతున్న వేళ వెలుగుచూసిన దారుణం
అమెరికాలో భారతీయ పౌరులు, భారత సంతతి వ్యక్తుల వరుస మరణాలపై ఆందోళనలు వ్యక్తమవుతున్న వేళ మరో దారుణం వెలుగుచూసింది. అలబామాలో ఒక హోటల్‌ను నిర్వహిస్తున్న ప్రవీణ్ రావోజీ భాయ్ పటేల్(76) అనే భారత సంతతి వ్యక్తిని ఓ వ్యక్తి కాల్చిచంపాడు. హోటల్ రూమ్‌ విషయంలో ప్రవీణ్, విలియం జెరెమీ మూర్‌ అనే ఓ కస్టమర్ మధ్య ఘర్షణ జరిగింది. తీవ్ర వాగ్వాదం జరిగింది. ఈ క్రమంలో తీవ్ర ఆగ్రహానికి గురైన కస్టమర్ తుపాకీతో కాల్పులు జరిపాడు. ఈ ఘటన గతవారం జరిగిందని, ప్రవీణ్ రావోజీ భాయ్ షెఫీల్డ్‌లోని ‘హిల్‌క్రెస్ట్ హోటల్’ యజమానిగా ఉన్నారని స్థానిక మీడియా రిపోర్ట్ పేర్కొంది.  

ఈ ఘటనపై షెఫీల్డ్ ప్రధాన పోలీసు అధికారి రికీ టెర్రీ ప్రకటన విడుదల చేశారు. ప్రవీణ్ రావోజీని తుపాకీతో కాల్చి చంపిన నిందితుడు విలియం జెరెమీ మూర్‌ను (34) అరెస్ట్ చేశామని వెల్లడించారు. నిందితుడు మూర్ ఒక గదిని అద్దెకు తీసుకోవాలని హోటల్‌కు వచ్చాడని, అయితే ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగిందని తెలిపారు. తీగ్ర ఆగ్రహానికి గురైన మూర్‌ తుపాకీతో కాల్పులు జరిపాడని, అనంతరం నిందితుడు తప్పించుకునేందుకు ప్రయత్నించాడని, అయితే అతడిని అదుపులోకి తీసుకున్నామని వివరించారు. కాగా వాగ్వాదం తర్వాత మూర్‌ని హోటల్ నుంచి బయటకు పంపించేందుకు పటేల్ ప్రయత్నించారని, కొంతదూరం వెళ్లిన మూర్ అకస్మాత్తుగా వెనక్కి వచ్చి తుపాకీతో కాల్పులు జరిపాడని ఫిర్యాదులో పేర్కొన్నారు.


More Telugu News