టీడీపీకి రాజీనామా చేసిన కేంద్ర మాజీ మంత్రి కిషోర్ చంద్రదేవ్

  • పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నానంటూ లేఖ రాసిన చంద్రదేవ్
  • బీజేపీతో పొత్తు కోసం టీడీపీ సంప్రదింపులు జరపడాన్ని వ్యతిరేకిస్తున్నానంటూ లేఖలో వివరణ
  • గత ఎన్నికల్లో అరకు లోక్‌సభ స్థానం నుంచి టీడీపీ తరపున పోటీ
కేంద్ర మాజీ మంత్రి కిశోర్ చంద్ర దేవ్ తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేశారు. ఈ మేరకు ఆ పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడికి ఆయన లేఖ రాశారు. గత లోక్‌సభ ఎన్నికల్లో అరకు లోక్‌సభ స్థానం నుంచి టీడీపీ తరపున పోటీ చేసిన ఆయన బీజేపీతో పొత్తు కోసం సంప్రదింపులు జరపడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఇదే విషయాన్ని చంద్రబాబుకు రాసిన లేఖలో పేర్కొన్నారు. విద్వేష శక్తులతో చేతులు కలపడం సహించరాని విషయమని ఆయన వ్యాఖ్యానించారు. అధికారం కోసం తన అంతరాత్మను అమ్ముకోలేనని అన్నారు. 

గత ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా అరకు ఎంపీ స్థానానికి పోటీ చేశారు కిషోర్ చంద్రదేవ్. ఆ ఎన్నికల్లో ఓటమి తర్వాత ఆయన ఢిల్లీకే పరిమితమయ్యారు. ఎన్డీయేలో టీడీపీ చేరిక విషయంపై ఇటీవలే అమిత్ షా, చంద్రబాబు మధ్య కీలకమైన చర్చలు జరిగాయి. ఈ నేపథ్యంలో కిశోర్ చంద్రదేవ్ రాజీనామా చేయడం గమనార్హం.


More Telugu News