రాయ్‌బరేలీ ప్రజలకు భావోద్వేగపూరిత లేఖ రాసిన సోనియా గాంధీ

  • అనారోగ్యం, వయస్సురీత్యా లోక్ సభకు పోటీ చేయడం లేదని పేర్కొన్న సోనియా 
  • ఈ స్థాయిలో ఉన్నానంటే అందుకు మీరే కారణమంటూ వెల్లడి  
  • నేరుగా సేవ చేసే అవకాశం లేనప్పటికీ తన ఆత్మ, హృదయం మీతోనే ఉంటుందని వెల్లడి
ఏఐసీసీ అగ్రనాయకురాలు సోనియా గాంధీ రాయ్‌బరేలీ నియోజకవర్గ ప్రజలకు గురువారం భావోద్వేగ లేఖ రాశారు. ఆమె నిన్న రాజ్యసభకు నామినేషన్ దాఖలు చేశారు. 1999 నుంచి లోక్ సభకు పోటీ చేస్తూ వస్తోన్న ఆమె ఈసారి పార్లమెంట్ ఎన్నికల బరిలో నుంచి తప్పుకోవాలని నిర్ణయించారు. ఈ నేపథ్యంలో సుదీర్ఘకాలం రాయ్‌బరేలీ లోక్ సభ నియోజకవర్గం నుంచి ఎంపీగా ఉన్న ఆమె తన నియోజకవర్గ ప్రజలకు బహిరంగ లేఖ రాస్తూ, ధన్యవాదాలు తెలిపారు.

ఆరోగ్య సమస్యల కారణంగా లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేయలేకపోతున్నట్లు ఆ లేఖలో పేర్కొన్నారు. 2004 నుంచి సోనియా గాంధీ ఈ నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అయితే తన తర్వాత ఇదే నియోజకవర్గం నుంచి తమ కుటుంబంలోని వారే పోటీ చేసే అవకాశాలు ఉన్నట్లు ఆమె హింట్ ఇచ్చారు.  

 ఆరోగ్యం, వయస్సు కారణంగా లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేయడం లేదని నియోజకవర్గ ప్రజలకు... ఓటర్లకు తెలిపారు. 'ఈ రోజు నేను ఏ స్థాయిలో ఉన్నా దానికి మీరే కారణమని గర్వంగా చెప్పగలన'ని రాయ్‌బరేలీ నియోజకవర్గ ప్రజలను ఉద్దేశించి ఆమె పేర్కొన్నారు. మీ నమ్మకాన్ని నిలబెట్టేందుకు నేను నా వంతు కృషి చేశానని పేర్కొన్నారు.

అనారోగ్యం, వయస్సు సమస్యల కారణంగా రానున్న లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేయనని ఆమె పేర్కొన్నారు. తాను పోటీ చేయని కారణంగా నేరుగా మీకు సేవ చేసే అవకాశం ఉండదు.. కానీ నా హృదయం, ఆత్మ ఎల్లప్పుడూ మీతోనే ఉంటాయన్నారు. గతంలో మాదిరిగానే భవిష్యత్తులోనూ మీరు నాకు, నా కుటుంబానికి అండగా ఉంటారని ఆశిస్తున్నానని పేర్కొన్నారు. ఈ లేఖను సోనియా హిందీలో రాశారు. 


More Telugu News