'రాజధాని ఫైల్స్' సినిమా విడుదలపై స్టే విధించిన హైకోర్టు

  • ఈరోజు విడుదల కావాల్సి ఉన్న 'రాజధాని ఫైల్స్'
  • జగన్ ప్రతిష్ఠను దిగజార్చేలా సినిమా ఉందని హైకోర్టులో పిటిషన్
  • రేపటి వరకు సినిమా విడుదలను ఆపేయాలని హైకోర్టు ఆదేశం
వైసీపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా తెరకెక్కిన 'రాజధాని ఫైల్స్' చిత్రంపై ఏపీ హైకోర్టు కీలక ఉత్తర్వులు జారీ చేసింది. రేపటి వరకు సినిమా విడుదలను నిలిపివేయాలని ఆదేశాలు జారీ చేసింది. సినిమాకు చెందిన అన్ని రికార్డులను తమకు అందించాలని ఆదేశించింది. వాస్తవానికి ఈరోజు సినిమా విడుదల కావాల్సి ఉంది. 

ఈ చిత్రంలో సీఎం జగన్, మాజీ మంత్రి కొడాలి నాని, వైసీపీ ప్రభుత్వ ప్రతిష్ఠను దిగజార్చేలా సన్నివేశాలు ఉన్నాయంటూ ఆ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లేళ్ల అప్పిరెడ్డి హైకోర్టులో పిటిషన్ వేశారు. వైసీపీని చులకన చేయాలనే ఉద్దేశంతోనే సినిమాను తీశారని పిటిషన్ లో ఆయన ఆరోపించారు. 

కోర్టులో విచారణ సందర్భంగా నిర్మాతల తరపు న్యాయవాది ఉన్నం మురళీధరరావు తన వాదనలు వినిపిస్తూ... రివిజన్ కమిటీ సూచనల మేరకు ఆయా సన్నివేశాలను తొలగించామని చెప్పారు. ఆ తర్వాతే తమకు సెన్సార్ బోర్డు సర్టిఫికెట్ ఇచ్చిందని తెలిపారు. డిసెంబర్ లో తమకు సెన్సార్ సర్టిఫికెట్ వస్తే... వైసీపీ ఇప్పుడు హైకోర్టును ఆశ్రయించిందని చెప్పారు.


More Telugu News