ఇక్కడ రాజీవ్ గాంధీ విగ్రహం లేని లోటు స్పష్టంగా కనిపించింది: రాజీవ్ విగ్రహం శంకుస్థాపన కార్యక్రమంలో రేవంత్ రెడ్డి

  • టెలికాం రంగంలో విప్లవాత్మక మార్పు తెచ్చిన మహా నేత రాజీవ్ గాంధీ అని కొనియాడిన రేవంత్ రెడ్డి
  • దేశ సమగ్రత కోసం ప్రాణాలు అర్పించిన మహనీయుడన్న రేవంత్ రెడ్డి
  • మహానుభావుల విగ్రహాలు చూసినపుడు వారి స్పూర్తితో ముందుకెళ్లాలన్న భావన మనకు కలగాలని వ్యాఖ్య
ఒకపక్క అంబేడ్కర్, మరోపక్క ఇందిరాగాంధీ, పీవీ నరసింహారావు, జైపాల్ రెడ్డి విగ్రహాలు ట్యాంక్ బండ్ పరిసరాల్లో ఉన్నాయని... కానీ ఇక్కడ రాజీవ్ గాంధీ విగ్రహం లేని లోటు స్పష్టంగా కనిపించిందని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. తెలంగాణ సచివాలయం ఎదురుగా గురువారం రాజీవ్ గాంధీ విగ్రహం ఏర్పాటుకు శంకుస్థాపన కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ, టెలికాం రంగంలో విప్లవాత్మక మార్పు తెచ్చిన మహా నేత రాజీవ్ గాంధీ అని కొనియాడారు.

దేశ సమగ్రత కోసం ప్రాణాలు అర్పించిన మహనీయుడు రాజీవ్ గాంధీ అన్నారు. ఆయన విగ్రహం కేవలం జయంతి, వర్ధంతులకు దండలు వేసి దండాలు పెట్టడానికి కాదని... మహానుభావుల విగ్రహాలు చూసినపుడు వారి స్పూర్తితో ముందుకెళ్లాలన్న భావన మనకు కలగాలన్నారు. ఇది చరిత్రలో నిలిచిపోయే సందర్భమన్నారు. సచివాలయం ఎదురుగా రాజీవ్ గాంధీ విగ్రహం ఉన్నన్ని రోజులు ఈ సందర్భం గుర్తుకు ఉంటుందన్నారు. అందరికీ ఆదర్శంగా ఉండే రాజీవ్ గాంధీ విగ్రహాన్ని ఇక్కడ ఏర్పాటు చేసుకోబోతున్నామన్నారు. ఈ రాజీవ్ గాంధీ విగ్రహావిష్కరణకు సోనియా గాంధీని ఆహ్వానిస్తున్నామని తెలిపారు.


More Telugu News