టీమిండియాలో కోహ్లీ లేకపోవడంపై ఇంగ్లండ్ కెప్టెన్ స్టోక్స్ స్పందన

  • వ్యక్తిగత కారణాలతో టీమిండియా నుంచి తప్పుకున్న కోహ్లీ
  • కోహ్లీ లేకుండానే ఇంగ్లండ్ తో టెస్టు సిరీస్ ఆడుతున్న టీమిండియా
  • గాయంతో జట్టుకు దూరమైన కేఎల్ రాహుల్
  • వాళ్లిద్దరూ లేకపోతే ఇంగ్లండ్ కు లాభిస్తుందన్న వాదనను కొట్టిపారేసిన స్టోక్స్
టీమిండియా, ఇంగ్లండ్ జట్ల మధ్య ఐదు టెస్టుల సిరీస్ లో భాగంగా మూడో టెస్టు రేపు (ఫిబ్రవరి 15) రాజ్ కోట్ లో ప్రారంభం కానుంది. ఈ సిరీస్ లో ఇరుజట్లు చెరో మ్యాచ్ నెగ్గి 1-1తో సమవుజ్జీలుగా ఉన్నాయి. 

ఈ నేపథ్యంలో, ఇంగ్లండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. టీమిండియాలో విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్ లేకపోవడంపై స్పందించాడు. కోహ్లీ, కేఎల్ రాహుల్ ఆడకపోవడం ఇంగ్లండ్ కు లాభించే అంశం అంటూ జరుగుతున్న ప్రచారం అర్థరహితం అని స్టోక్స్ కొట్టిపారేశాడు. 

"కేఎల్ రాహుల్ గాయంతో తప్పుకున్నాడు. కోహ్లీ ఇతర కారణాల వల్ల ఆడడంలేదు. వాళ్లిద్దరూ జట్టులో లేనంత మాత్రాన అది మాకు మేలు చేకూర్చేదని, టీమిండియాకు నష్టం అని మేం భావించడంలేదు. ఇలాంటి వాదనలు నాకు ఇష్టం ఉండదు. ఈ సిరీస్ లో మమ్మల్ని ఇబ్బంది పెట్టే అంశాలు ఇంకా ఉండనే ఉన్నాయి" అని వివరించాడు. 

అంతేకాదు, "కోహ్లీ జట్టులో లేకపోవడానికి కొన్ని కారణాలు ప్రచారంలో ఉన్నాయి. ఈ నేపథ్యంలో మా జట్టు తరఫున కోహ్లీకి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం" అని స్టోక్స్ వెల్లడించాడు.

కోహ్లీ మైదానంలో ఉండాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారని, త్వరలోనే కోహ్లీ మళ్లీ క్రికెట్ బరిలో దిగుతాడని ఆశిస్తున్నామని తెలిపాడు.


More Telugu News