జాతీయ అవార్డులను దొంగిలించి ట్విస్ట్ ఇచ్చిన దొంగలు.. తమిళ డైరెక్టర్ మణికందన్‌కు ఊరట

  • కొట్టేసిన అవార్డులను ఇంటి గేటు ముందు వదిలి వెళ్లిన దొంగలు
  • ‘మీ కష్టం మీదే’ అంటూ లేఖ ద్వారా క్షమాపణలు కోరిన వైనం
  • ఇటీవల మధురైలోని మణికందన్‌ నివాసంలో విలువైన వస్తువులతో పాటు జాతీయ అవార్డులు కొట్టేసిన దొంగలు
ప్రముఖ తమిళ డైరెక్టర్ మణికందన్‌కు చెందిన రెండు జాతీయ అవార్డుల తస్కరణ ఘటనలో దొంగలు పెద్ద ట్విస్ట్ ఇచ్చారు. కొట్టేసిన రెండు జాతీయ అవార్డులను తిరిగి ఇచ్చేశారు. దొంగతనం చేసిన రెండు రోజుల తర్వాత దర్శకుడి ఇంటి గేటు వెలుపల పతకాలను వదిలివెళ్లారు. అవార్డులను ఒక ప్లాస్టిక్ బ్యాగులో ఉంచి గేటు ముందు పెట్టి వెళ్లారు. అంతేకాదు క్షమాపణలు కోరుతూ ఒక లేఖను కూడా వదిలివెళ్లారు. ‘‘ సార్.. దయచేసి మమ్మల్ని క్షమించండి. మీ కష్టం మీదే’’ అంటూ తమిళంలో నోట్ రాశారని డెక్కన్ హెరాల్డ్ రిపోర్ట్ పేర్కొంది. 

కాగా మధురైలో దర్శకుడు మణికందన్ పూర్వీకుల ఇంట్లో ఇటీవల దొంగతనం జరిగింది. మణికందన్‌కు చెందిన రెండు జాతీయ సినిమా అవార్డు పతకాలతో పాటు సుమారు 15 తులాల బంగారం, లక్ష రూపాయల నగదు, ఇతర విలువైన వస్తువులను దోచుకెళ్లారు. అయితే దొంగతనం చేసిన వస్తువుల్లో అవార్డులను తిరిగిచ్చేయడం ఆసక్తికరంగా మారింది. ప్రతిష్టాత్మక అవార్డులను వెనక్కి ఇచ్చేయడంతో మణికందన్ ఊపిరిపీల్చుకున్నారు. కాగా డైరెక్టర్ మణికందన్ చెన్నైలో ఉన్న సమయంలో ఈ దొంగతనం జరిగింది. ఇంట్లో శునకాలు ఉన్నప్పటికీ దొంగతనం జరగడం గమనార్హం. మరుసటి రోజు ఇంట్లోని శునకాలకు ఆహారం వేసేందుకు దర్శకుడి ఫ్రెండ్స్ వెళ్లగా ఈ దొంగతనం వెలుగుచూసింది.

కాగా ఘటనకు సంధించిన వివరాలను స్థానిక డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ సి. నల్లు వెల్లడించారు. అవార్డులను తిరిగి వెనక్కి ఇచ్చేసినప్పటికీ ఇతర వస్తువులు రికవరీ కాలేదన్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నామని వివరించారు.


More Telugu News