మద్యం కేసులో కేజ్రీవాల్‌కు ఆరోసారి ఈడీ నోటీసులు

  • ఈ నెల 19న విచారణకు రావాలని ఆదేశాలు
  • అంతకుముందు ఐదుసార్లు వివిధ కారణాలతో విచారణకు గైర్హాజరు
  • కుంటి సాకులు చెప్పి తప్పించుకుంటున్నారన్న ఈడీ
మద్యం కేసులో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌కు ఈడీ మరోసారి సమన్లు పంపించింది. విచారణకు హాజరు కావాలంటూ ఈడీ సమన్లు పంపించడం ఇది ఆరోసారి. ఈ నెల 19వ తేదీన మద్యం కేసులో విచారణకు హాజరు కావాలని ఈడీ నోటీసుల్లో పేర్కొంది. ఇదివరకు ఐదుసార్లు వివిధ కారణాలతో అరవింద్ కేజ్రీవాల్ విచారణకు హాజరు కాలేదు.

కేజ్రీవాల్‌ను అంతకుముందు ఫిబ్రవరి 2న, జనవరి 18న, జనవరి 3న, 2023 డిసెంబర్ 21, నవంబర్ 2 తేదీల్లో ఈడీ విచారణకు పిలిచింది. అయితే ఈ నోటీసులు చట్టవిరుద్ధమంటూ ఆయన విచారణకు హాజరుకాలేదు. అయితే కేజ్రీవాల్ విచారణకు హాజరు కావాలని ఢిల్లీ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఇదే సమయంలో ఈడీ ఆరోసారి నోటీసులు జారీ చేసింది.

కుంటి సాకులు చెబుతున్నారంటున్న ఈడీ

ఢిల్లీ ముఖ్యమంత్రి ఉద్దేశ్యపూర్వకంగా సమన్లను ధిక్కరిస్తున్నారని, కుంటి సాకులు చెబుతున్నారని ఈడీ కోర్టుకు తెలిపింది. అతనిలాంటి ఉన్నతస్థాయి ప్రజాప్రతినిధి చట్టవిరుద్ధంగా ప్రవర్తిస్తే సామాన్యుడికి (ఆమ్ ఆద్మీ)కి తప్పుడు సంకేతాలు ఇచ్చినట్లు అవుతుందని ఈడీ పేర్కొంది. కేజ్రీవాల్‌ను విచారించేందుకు తమ వద్ద సరైన ఆధారాలు ఉన్నాయని తెలిపారు. మరోవైపు ఈ సమన్లు చట్ట విరుద్ధం, రాజకీయ ప్రేరేపితమని కేజ్రీవాల్ గతంలో ఈడీకి లేఖ రాశారు. రానున్న లోక్ సభ ఎన్నికల్లో ప్రచారం చేయకుండా నిలువరించడమే వారి ఉద్దేశ్యంగా కనిపిస్తోందన్నారు.


More Telugu News