రెసిడెన్షియల్ స్కూల్ విద్యార్థులతో నారా భువనేశ్వరి మాటామంతీ

  • నిజం గెలవాలి యాత్ర కోసం కదిరి వచ్చిన నారా భువనేశ్వరి
  • ఎర్రదొడ్డిలోని హరీశ్ రెసిడెన్షియల్ స్కూల్ సందర్శన
  • స్కూల్ ప్రాంగణంలోని సరస్వతీ అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు
  • విద్యార్థులకు దిశానిర్దేశం 
టీడీపీ అధినేత చంద్రబాబు అర్ధాంగి నారా భువనేశ్వరి నిజం గెలవాలి యాత్రలో భాగంగా ఉమ్మడి అనంతపురం జిల్లా కదిరి వచ్చారు. ఇక్కడి ఎర్రదొడ్డిలో ఉన్న హరీశ్ రెసిడెన్షియల్ స్కూల్ విద్యార్థులతో ఆమె సమావేశమై వారితో ముచ్చటించారు. విద్యార్థులతో మాట్లాడి వారి లక్ష్యాలను తెలుసుకున్నారు. లక్ష్య సాధన కోసం ఏం చేయాలో విద్యార్థులకు దిశానిర్దేశం చేశారు. 

సాంకేతిక పరిజ్ఞానాన్ని సద్వినియోగం చేసుకుని జీవితంలో ఉన్నత సోపానాలు అధిరోహించాలని నారా భువనేశ్వరి పిలుపునిచ్చారు. అంతిమంగా రాష్ట్రానికి మేలు చేసేలా విద్యార్థులు ఎదగాలని ఆకాంక్షించారు. 

అయితే, సాంకేతిక పరిజ్ఞానాన్ని దుర్వినియోగం చేయరాదని, అదే సమయంలో సంస్కృతి, సంప్రదాయాలను అలవర్చుకోవాలని సూచించారు. మన సంస్కృతిలో గురువులకు విశిష్ట స్థానం ఉందని, అందుకే గురువులను దేవుళ్లతో సమానంగా భావించాలని అన్నారు. 

కాగా, నారా భువనేశ్వరి హరీశ్ రెసిడెన్షియల్ స్కూల్ కు వచ్చిన సందర్భంగా విద్యార్థులు ఆమెకు గాయత్రీ శ్లోకం వినిపించారు. అంతకుముందు, స్కూల్ ప్రాంగణంలోని సరస్వతీ దేవి ఆలయాన్ని భువనేశ్వరి సందర్శించి, అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు.


More Telugu News