కాంగ్రెస్‌కు షాక్... ఆ పార్టీకి రాజీనామా చేసి బీజేపీలో చేరిన లాల్ బహదూర్ శాస్త్రి మనవడు

  • కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ఖర్గేకు లేఖ
  • యూపీ ఉపముఖ్యమంత్రి బ్రజేష్ పాఠక్ సమక్షంలో బీజేపీలో చేరిక
  • ఇండియా కూటమికి సిద్ధాంతం లేదంటూ విమర్శ
కాంగ్రెస్ పార్టీకి మరో షాక్ తగిలింది. సార్వత్రిక ఎన్నికలకు ముందు పార్టీ నుంచి పలువురు బయటకు పోతున్నారు. తాజాగా మాజీ ప్రధాని, దివంగత లాల్ బహదూర్ శాస్త్రి మనవడు విభాకర్ శాస్త్రి కాంగ్రెస్‌కు రాజీనామా చేశారు. ఏఐసీసీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేకు ఆయన రాజీనామా పత్రాన్ని అందించారు. 'గౌరవనీయులైన కాంగ్రెస్ అధ్యక్షుడు శ్రీ ఖర్గేజీ! సర్, నేను ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నాను' అని సింగిల్ లైన్‌లో లేఖను పంపించినట్లు సోషల్ మీడియా అనుసంధాన ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు.

విభాకర్ శాస్త్రి ఆ తర్వాత బీజేపీలో చేరారు. ఉత్తర ప్రదేశ్ ఉపముఖ్యమంత్రి బ్రజేశ్ పాఠక్ సమక్షంలో ఆయన కమలం పార్టీలో చేరారు. మహారాష్ట్రలో మాజీ ముఖ్యమంత్రి అశోక్ చవాన్, బాబా సిద్ధిఖీ తదితరులు ఇటీవలే కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పారు.

బీజేపీలో చేరిన అనంతరం విభాకర్ శాస్త్రి మాట్లాడుతూ... 'నా కోసం బీజేపీ తలుపులు తెరిచినందుకు ప్రధాని నరేంద్ర మోదీ, నడ్డా, అమిత్ షా, యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్, ఉపముఖ్యమంత్రి బ్రజేష్ పాఠక్‌లకు కృతజ్ఞతలు. మా తాత లాల్ బహదూర్ శాస్త్రి దార్శనికతను ముందుకు తీసుకువెళ్లడానికి బీజేపీ అవకాశం ఇచ్చిందని భావిస్తున్నాను. పార్టీ ఆదేశాల మేరకు పని చేస్తాను. ఇండియా కూటమికి ఎలాంటి సిద్ధాంతం లేదు. కేవలం మోదీని తొలగించడమే లక్ష్యంగా పెట్టుకుంది. కాంగ్రెస్ సిద్ధాంతం ఏమిటో రాహుల్ చెప్పాలి' అన్నారు.


More Telugu News