బిడ్డకు జన్మనిచ్చిన ఆరు నెలల్లోనే మళ్లీ ప్రసవించిన మహిళ.. అమెరికాలో అరుదైన సంఘటన

  • గర్భంతో ఉండగానే మళ్లీ గర్భం దాల్చడం వైద్య చరిత్రలో అత్యంత అరుదంటున్న డాక్టర్లు
  • ‘సూపర్ ఫిటేషన్’ గా వ్యవహరించే ఈ ప్రసవం ప్రపంచంలోనే పదకొండవది..
  • కవల పిల్లలకు సూపర్ ఫిటేషన్ వల్ల పుట్టే పిల్లలకు వయసులో తేడా
వైద్య శాస్త్ర చరిత్రలోనే అత్యంత అరుదైన ఘటన అమెరికాలో తాజాగా చోటుచేసుకుంది. కాలిఫోర్నియాకు చెందిన జెస్సికా అనే మహిళ ఇద్దరు పిల్లలకు జన్మనిచ్చింది. ఇందులో వింత ఏముందని అనుకుంటున్నారా.. జెస్సికా ఓ బిడ్డకు జన్మనిచ్చిన ఆరు నెలల్లోనే మరో బిడ్డకు జన్మనిచ్చింది. అంటే గర్భం దాల్చిన మూడు నెలలకు మరోసారి గర్భం దాల్చింది. ఒకే సమయంలో జెస్సికా కడుపులో వేర్వేరు వయసున్న పిండాలు ఎదిగాయి. వారాల వ్యవధిలో ఉన్న ఈ శిశువులు పూర్తిగా ఎదిగిన తర్వాత భూమ్మీదకు వచ్చాయి. వైద్య చరిత్రలో అత్యంత అరుదైన ఈ పరిస్థితిని ‘సూపర్ ఫిటేషన్’ అని వ్యవహరిస్తారని డాక్టర్లు వెల్లడించారు. ఇలా గర్భంతో ఉండగానే మళ్లీ గర్భందాల్చిన కేసులు ప్రపంచవ్యాప్తంగా కేవలం పది మాత్రమే ఉన్నాయని, జెస్సికా కేసు పదకొండవదని చెప్పారు.

ఏమిటీ సూపర్ ఫిటేషన్..
మహిళ గర్భాశయం నుంచి విడుదలయ్యే అండం సంభోగం తర్వాత విడుదలయ్యే శుక్ర కణంతో కలిసి గర్భాశయంలో పిండంగా రూపుదిద్దుకుంటుంది. ఇలా గర్భందాల్చిన తర్వాత సంభోగంలో పాల్గొన్నపుడు మరోసారి అండం, శుక్ర కణాలు కలిసేందుకు వీలుండదు. అయితే, సూపర్ ఫిటేషన్ లో ఈ ప్రాసెస్ పునరావృతం అవుతుంది. ఓవైపు గర్భాశయంలో పిండం రూపుదిద్దుకుంటుండగా మరో అండం, శుక్ర కణంతో కలిసి గర్భాశయంలోనే సెపరేట్ గా పిండంగా ఏర్పడుతుంది. మొదటి పిండానికి వారాల తేడాతో రెండో పిండం కూడా ఎదుగుతుంది.

రెండింటి మధ్య ఈ వయసు తేడా కారణంగా డెలివరీ కష్టసాధ్యంగా మారుతుంది. నెలలు నిండిన తర్వాత మొదటి శిశువును జాగ్రత్తగా ఆపరేషన్ చేసి బయటకు తీయాల్సి ఉంటుంది. రెండో శిశువు ఇంకా పూర్తిగా ఎదగకపోవడం వల్ల మరికొన్ని వారాలు గర్భంలోనే ఉండాల్సిన పరిస్థితి. ఈ కేసుల్లో రెండో శిశువు నెలలు నిండకుండానే పుట్టడమో, గర్భవిచ్చిత్తి కావడమో జరుగుతుంది. అత్యంత అరుదైన ఈ కేసుల్లో గర్భందాల్చిన మహిళతో పాటు వైద్యులు కూడా చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సి వస్తుంది.

కవలల జననం వేరు..
కవల పిల్లలకు, సూపర్ ఫిటేషన్ ద్వారా జన్మించే పిల్లలకు తేడా ఉంది. ఒకేసారి రెండు అండాలు విడుదలై రెండు శుక్రకణాలతో కలిసి వేర్వేరు పిండాలుగా ఎదిగి కవల పిల్లలు జన్మిస్తారు. కవలలు ఒకే సమయంలో గర్భంలో విడివిడిగా ఎదుగుతారు. సూపర్ ఫిటేషన్ లో మాత్రం వేర్వేరు సమయాల్లో శిశువులు ఎదుగుతారు. ఒకసారి గర్భందాల్చిన తర్వాత కొన్ని వారాల వ్యవధిలో రెండోసారి గర్భందాల్చడం వల్ల శిశువుల వయసులో మూడు నుంచి ఆరు నెలలకు పైగా తేడా ఉంటుంది.



More Telugu News