నామినేషన్ వేయడానికి జైపూర్ కు చేరుకున్న సోనియాగాంధీ

  • రాజస్థాన్ నుంచి రాజ్యసభకు పోటీ చేస్తున్న సోనియా
  • తొలిసారి ఎగువ సభలో అడుగుపెట్టబోతున్న కాంగ్రెస్ అగ్ర నాయకురాలు
  • ఈ నెల 27తో ముగుస్తున్న 56 మంది రాజ్యసభ సభ్యుల పదవీకాలం
కాంగ్రెస్ అగ్ర నాయకురాలు సోనియాగాంధీ ఈసారి లోక్ సభ ఎన్నికల్లో కాకుండా రాజ్యసభ ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. రాజస్థాన్ నుంచి ఆమె రాజ్యసభ ఎన్నికల బరిలోకి దిగుతున్నారు. ఈ నేపథ్యంలో, ఢిల్లీ నుంచి బయల్దేరిన సోనియా కాసేపటి క్రితం రాజస్థాన్ రాజధాని జైపూర్ కు చేరుకున్నారు. ఆమెతో పాటు రాహుల్, ప్రియాంకాగాంధీలు ఉన్నారు. ఈరోజు సోనియా తన నామినేషన్ దాఖలు చేయనున్నారు. నామినేషన్లు సమర్పించడానికి రేపు చివరి తేదీ. 27న ఎన్నికలు జరుగుతాయి. 

ఐదు సార్లు లోక్ సభకు ఎన్నికైన 77 ఏళ్ల సోనియాగాంధీ తొలిసారి రాజ్యసభలో అడుగుపెట్టబోతున్నారు. ప్రస్తుతం ఆమె ఉత్తరప్రదేశ్ లోని రాయ్ బరేలీ నుంచి లోక్ సభకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో రాయ్ బరేలీ నుంచి ఆమె కుమార్తె ప్రియాంకాగాంధీ పోటీ చేసే అవకాశాలు ఉన్నాయని విశ్వసనీయంగా తెలుస్తోంది. 

నామినేషన్ల దాఖలు సమయంలో సోనియాతో పాటు మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ, ప్రియాంకాగాంధీ ఉంటారని తెలుస్తోంది. ఈనెల 27న 15 రాష్ట్రాలకు చెందిన 56 మంది రాజ్యసభ సభ్యుల పదవీకాలం ముగుస్తోంది. ఈ నేపథ్యంలో, ఈ స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. రాజస్థాన్ లో మూడు స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ మూడింట్లో ఒక స్థానంలో కాంగ్రెస్ సునాయాసంగా విజయాన్ని సాధిస్తుంది. అందుకే, సోనియా ఇక్కడి నుంచి పోటీ చేస్తున్నారు. దక్షిణాదిన తెలంగాణ, కర్ణాటక నుంచి పోటీ చేసే అవకాశం ఉన్నప్పటికీ... ఆమె రాజస్థాన్ నుంచి పోటీ చేయడానికే మొగ్గు చూపారు. లోక్ సభకు మరోసారి పోటీ చేయబోనని 2019లోనే సోనియా ప్రకటించారు.


More Telugu News