ఇండిగో విమానంలో ఇచ్చిన శాండ్‌విచ్‌లో ఇనుప స్క్రూ..!

  • ఫిబ్రవరి 1న బెంగళూరు-చెన్నై విమానంలో ఘటన
  • విమానం దిగాక శాండ్‌విచ్‌లో స్క్రూ ఉన్న విషయాన్ని గుర్తించిన ప్యాసెంజర్
  • ప్రయాణం ముగిశాక ఫిర్యాదు చేస్తే తామేం చేయలేమన్న ఇండిగో
ఇండిగో విమానంలో తనకు ఇచ్చిన ఓ శాండ్‌విచ్‌లో ఇనుప స్క్రూ కనిపించిందని ప్రయాణికుడు ఒకరు సోషల్ మీడియాలో పేర్కొన్నారు. అయితే, విమానంలో వుండగా తాను ఆ శాండ్ విచ్ తినలేదని, విమానం దిగాక తిందామని ప్యాక్ ఓపెన్ చేశాక తాను ఈ విషయాన్ని గుర్తించానని పేర్కొన్నాడు. దీంతో తనకు ఫిర్యాదు చేసే హక్కు లేదని ఎయిర్‌లైన్స్ అన్నట్టు వెల్లడించాడు. ఈ పరిస్థితుల్లో తాను ఏం చేయాలో చెప్పండని నెటిజన్లను కోరాడు. ఈ నెల 1న ఆ ప్యాసెంజర్ బెంగళూరు నుంచి చెన్నై వెళుతుండగా ఈ ఘటన జరిగింది. 

ఈ ఘటనపై నెటిజన్లు పెద్ద ఎత్తున స్పందించారు. కంపెనీ సీఈఓకు నేరుగా ఫిర్యాదు చేయాలని కొందరు సలహా ఇచ్చారు. మరికొందరేమో లింక్డ్‌ఇన్ ద్వారా ఫిర్యాదు చేస్తే ఫలితం ఉంటుందని చెప్పారు. ట్విట్టర్, ఫేస్‌బుక్‌లోని ఫిర్యాదులను పట్టించుకోకపోవచ్చని అభిప్రాయపడ్డారు. ఎఫ్ఎస్ఎస్ఏఐకి ఫిర్యాదు చేయాలని కొందరు, వినియోగదారుల కోర్టును ఆశ్రయించాలని మరికొందరు సూచించారు. 

ఘటన వైరల్ కావడంతో ఇండిగో ఎయిర్‌లైన్స్ కూడా స్పందించింది. ప్యాసెంజర్ కు కలిగిన అసౌకర్యానికి చింతిస్తున్నామని పేర్కొంది. అయితే, ఘటనకు సంబంధించి ప్రయాణికుడు సకాలంలో ఫిర్యాదు చేయలేదని చెప్పింది. ప్యాసెంజర్లకు నాణ్యమైన సేవలు అందించేందుకు తాము కట్టుబడి ఉన్నామని స్పష్టం చేసింది.


More Telugu News