భారత రెజ్లింగ్ ఫెడరేషన్ పై తొలగిన నిషేధం

  • సకాలంలో ఎన్నికలు జరపలేదంటూ గత ఆగస్టులో డబ్ల్యూఎఫ్ఐపై నిషేధం
  • డిసెంబరులో ఎన్నికలు జరుపుకున్న డబ్ల్యూఎఫ్ఐ
  • సస్పెన్షన్ ఎత్తివేస్తున్నట్టు ప్రకటించిన యునైటెడ్ వరల్డ్ రెజ్లింగ్
సకాలంలో ఎన్నికలు నిర్వహించడంలో విఫలమైందంటూ భారత రెజ్లింగ్ సమాఖ్య (డబ్ల్యూఎఫ్ఐ)పై యునైటెడ్ వరల్డ్ రెజ్లింగ్ (యూడబ్ల్యూడబ్ల్యూ) గతేడాది ఆగస్టులో నిషేధం విధించిన సంగతి తెలిసిందే. ఇప్పుడా నిషేధాన్ని ఎత్తివేస్తున్నట్టు యూడబ్ల్యూడబ్ల్యూ ప్రకటించింది. గత డిసెంబరులో భారత రెజ్లింగ్ సమాఖ్యకు ఎన్నికలు జరిగిన నేపథ్యంలో యూడబ్ల్యూడబ్ల్యూ ఈ నిర్ణయం తీసుకుంది. 

అయితే, భారత రెజ్లింగ్ సమాఖ్యపై సస్పెన్షన్ ను ఎత్తివేస్తూ యూడబ్ల్యూడబ్ల్యూ ఓ షరతు విధించింది. భారత రెజ్లింగ్ సమాఖ్యపై తీవ్రస్థాయిలో నిరసనలు తెలిపిన రెజ్లర్ల త్రయం భజరంగ్ పునియా, వినేశ్ ఫోగాట్, సాక్షి మాలిక్ లపై ఎట్టి పరిస్థితుల్లోనూ వివక్ష చూపించరాదని స్పష్టం చేసింది. ఈ మేరకు లిఖితపూర్వక హామీ ఇవ్వాలని భారత రెజ్లింగ్ సమాఖ్యను ఆదేశించింది. 

భారత రెజ్లింగ్  సమాఖ్యకు గతంలో చీఫ్ గా వ్యవహరించిన బ్రిజ్ భూషణ్ పై రెజ్లర్లు లైంగిక వేధింపుల ఆరోపణలు చేయడం తెలిసిందే. బ్రిజ్ భూషణ్ బీజేపీ ఎంపీగా ఉన్నారు. ఆయనకు వ్యతిరేకంగా రెజ్లర్లు ఢిల్లీ వీధుల్లోకి వచ్చి నిరసనలు చేపట్టారు. ఈ క్రమంలో డబ్ల్యూఎఫ్ఐకి డిసెంబరులో ఎన్నికలు జరగ్గా... బ్రిజ్ భూషణ్ సన్నిహితుడు సంజయ్ సింగ్ గెలిచారు. 

అయితే ఇది జరిగిన కొన్ని రోజులకే... జాతీయ క్రీడా నియమావళిని ఉల్లంఘించిందంటూ డబ్ల్యూఎఫ్ఐని కేంద్ర క్రీడల మంత్రిత్య శాఖ రద్దు చేసింది. భారత రెజ్లింగ్ వ్యవహారాల పర్యవేక్షణ కోసం అడ్ హాక్ కమిటీని నియమించింది. భారత రెజ్లింగ్ వ్యవహారాలపై అడ్ హాక్ కమిటీకి, డబ్ల్యూఎఫ్ఐకి మధ్య పోరు కొనసాగుతుండగా... డబ్ల్యూఎఫ్ఐకి ఊరట కలిగిస్తూ యూడబ్ల్యూడబ్ల్యూ నిషేధం ఎత్తివేస్తున్నట్టు ప్రకటించింది. దాంతో డబ్ల్యూఎఫ్ఐ వర్గాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి. 

యూడబ్ల్యూడబ్ల్యూ తమకు మళ్లీ అనుమతి ఇచ్చినందున దేశంలో తమదే అధికారిక రెజ్లింగ్ సంస్థ అవుతుందని డబ్ల్యూఎఫ్ఐ చెబుతోంది. అంతేకాదు, పారిస్ ఒలింపిక్స్ కోసం త్వరలోనే రెజ్లింగ్ ట్రయల్స్ కూడా నిర్వహిస్తామని డబ్ల్యూఎఫ్ఐ అధ్యక్షుడు సంజయ్ సింగ్ తెలిపారు. ఏ ఒక్క రెజ్లర్ కూడా అవకాశాలు కోల్పోకుండా చూస్తామని పేర్కొన్నారు.


More Telugu News