మేడిగడ్డలో ఏముంది... బొందల గడ్డనా? అంటూ కేసీఆర్ ఆక్రోశం వెళ్లగక్కుతున్నాడు: సీఎం రేవంత్ రెడ్డి

  • సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలో మేడిగడ్డను సందర్శించిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలు
  • కేసీఆర్ ధనదాహంతో కట్టిన ప్రాజెక్టు ఇవాళ బొందలగడ్డగా మారిందన్న రేవంత్
  • ఈ నేరానికి శిక్ష తప్పదు అంటూ ఘాటు వ్యాఖ్యలు 
సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలో కాంగ్రెస్ ఎమ్మెల్యేల బృందం నేడు మేడిగడ్డ ప్రాజెక్టును పరిశీలించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పై ధ్వజమెత్తారు. మేడిగడ్డకు ఎందుకు పోయారు? ఏముంది అక్కడ బొందల గడ్డనా? అంటూ కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఆక్రోశం వెళ్లగక్కుతున్నాడని విమర్శించారు. 

"నిజమే... కేసీఆర్ ధనదాహంతో లక్ష కోట్లు గుమ్మరించి కట్టిన ప్రాజెక్టు ఇవాళ బొందల గడ్డగా మారింది. తొమ్మిదిన్నరేళ్ల క్రితం తెలంగాణను పచ్చగా చేస్తానని కల్లబొల్లి మాటలు చెప్పావు. కాంగ్రెస్ ప్రారంభించిన అంబేద్కర్ ప్రాణహిత-చేవెళ్ల డిజైన్లు మార్చి కాళేశ్వరం పేరుతో కమీషన్లు బొక్కి కేసీఆర్ సృష్టించిన విధ్వంసం ఇవాళ మేడిగడ్డ రూపంలో కళ్ల ముందు కనిపిస్తోంది. 

కూలింది కాళేశ్వరం ప్రాజెక్టు కాదు... తెలంగాణ ప్రజల నమ్మకం. కుంగింది మేడిగడ్డ పిల్లరు కాదు... నాలుగు కోట్ల ప్రజల ఆశలు. ఈ నేరానికి శిక్ష తప్పదు. ఈ ఘోరం కళ్లారా చూసి, తెలంగాణ సమాజానికి కూడా చూపించే ప్రయత్నమే... సహచర మంత్రులు, శాసనసభ్యులతో కలిసి ఇవాళ్టి మేడిగడ్డ పర్యటన" అని రేవంత్ రెడ్డి వివరించారు.


More Telugu News