కేటీఆర్, హరీశ్ రావులు ప్రయాణిస్తున్న వాహనంపై కోడిగుడ్లతో దాడి
- ఈ సాయంత్రం నల్గొండలో బీఆర్ఎస్ సభ
- కేటీఆర్, హరీశ్ తదితర నేతలు ప్రయాణిస్తున్న బస్సుపై దాడి
- కోడిగుడ్లు విసిరిన ఎన్ఎస్ యూఐ కార్యకర్తలు
బీఆర్ఎస్ అగ్రనేతలు కేటీఆర్, హరీశ్ రావులకు ఊహించని నిరసన ఎదురయింది. వారు ప్రయాణిస్తున్న బస్సుపై కోడిగుడ్ల దాడి జరిగింది. నల్గొండలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఈ సాయంత్రం భారీ బహిరంగసభను నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో కేటీఆర్, హరీశ్ రావులతో పాటు పలువురు బీఆర్ఎస్ నేతలు ప్రయాణిస్తున్న బస్సును ఎన్ఎస్ యూఐ కార్యకర్తలు అడ్డుకున్నారు. నల్లచొక్కాలను ధరించి బీఆర్ఎస్ వ్యతిరేక నినాదాలు చేశారు. బస్సుపై కోడిగుడ్లను విసిరారు. కేసీఆర్, కేటీఆర్, హరీశ్ రావు గోబ్యాక్ అంటూ వారు నినాదాలు చేశారు. అయితే వెంటనే అప్రమత్తమైన పోలీసులు వీరిని అడ్డుకున్నారు. ఆ తర్వాత బీఆర్ఎస్ నేతలు అక్కడి నుంచి ముందుకు సాగారు. కాసేపటి క్రితం వీరు సభా ప్రాంగణానికి చేరుకున్నారు.