కాళేశ్వరం నివేదిక ఎప్పుడో ఇచ్చాక మళ్లీ రేవంత్ రెడ్డి సహా అందరూ వెళ్లాల్సిన అవసరం ఏమిటి?: బండి సంజయ్

  • మంత్రులు, ఇంజనీర్లు ఎప్పుడో కాళేశ్వరం వెళ్లి నివేదిక ఇచ్చారు కదా అని గుర్తు చేసిన బండి సంజయ్
  • కాళేశ్వరం అక్రమాలపై తెలంగాణ ప్రభుత్వం సీబీఐ విచారణను ఎందుకు కోరడం లేదో చెప్పాలని డిమాండ్
  • కృష్ణా నీటి పేరుతో బీఆర్ఎస్, కాళేశ్వరం పేరుతో కాంగ్రెస్ డ్రామాలు ఆడుతున్నాయని ఆగ్రహం
ఇంజినీర్లు ఎప్పుడో కాళేశ్వరం వెళ్లి నివేదికను అందించారని... అలాంటప్పుడు సీఎం రేవంత్ రెడ్డి, ప్రజాప్రతినిధులు అందరూ కలిసి మళ్లీ మేడిగడ్డ ప్రాజెక్టును సందర్శించాల్సిన అవసరం ఏమి వచ్చింది? అని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ ప్రశ్నించారు. సీఎం రేవంత్ రెడ్డి సహా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ప్రత్యేక బస్సుల్లో మేడిగడ్డ సందర్శనకు వెళ్లిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో బండి సంజయ్ మాట్లాడుతూ... మళ్లీ కాళేశ్వరం వెళ్లవలసిన అవసరం ఏమొచ్చిందన్నారు.

మంత్రులు, ఇంజనీర్లు ఎప్పుడో కాళేశ్వరం వెళ్లి నివేదిక ఇచ్చారు కదా అని గుర్తు చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టు అక్రమాలపై తెలంగాణ ప్రభుత్వం సీబీఐ విచారణను ఎందుకు కోరడం లేదో చెప్పాలన్నారు. కృష్ణా నీటి పేరుతో బీఆర్ఎస్, కాళేశ్వరం పేరుతో కాంగ్రెస్ డ్రామాలు ఆడుతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. ముక్కు నేలకు రాసి బీఆర్ఎస్ నేతలు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం హామీలను గాలికి వదిలేసిందని... అందుకు ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. అసెంబ్లీ విలువైన సమయాన్ని వృథా చేస్తారా? అని నిలదీశారు. తెలంగాణ ప్రజల కోసం బీజేపీ కొట్లాడుతోందని... కేంద్రం నిధులు ఇస్తోందని... అలాంటప్పుడు కాంగ్రెస్‌కు ఓట్లు వేయడం న్యాయమా? అన్నారు.


More Telugu News