రైతుల ‘ఢిల్లీ చలో’.. హర్యానా-పంజాబ్ సరిహద్దు వద్ద తీవ్ర ఉద్రిక్తత.. టియర్ గ్యాస్ ప్రయోగించిన పోలీసులు

  • ఈ ఉదయం 10 గంటలకు పంజాబ్ నుంచి 2500 ట్రాక్టర్లతో ఢిల్లీకి రైతులు
  • ఢిల్లీ చలో మార్చ్‌లో పాల్గొంటున్న 200పైగా రైతు సంఘాలు
  • గత రాత్రి కేంద్రమంత్రులతో జరిగిన చర్చలు విఫలం
  • రైతులు ఢిల్లీలో అడుగుపెట్టకుండా పోలీసుల కట్టుదిట్టమైన ఏర్పాట్లు
  • ఢిల్లీ సరిహద్దుల వద్ద భారీగా నిలిచిపోయిన ట్రాఫిక్
చూస్తుంటే రైతుల ‘ఢిల్లీ చలో’ ఆందోళన హింసాత్మకంగా మారేలా కనిపిస్తోంది. ఢిల్లీలోకి ప్రవేశించేందుకు రైతులు చేస్తున్న ప్రయత్నాలను అడ్డుకునేందుకు పోలీసులు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. ఈ ఉదయం ఢిల్లీ చలో కార్యక్రమం ప్రారంభమైన తర్వాత పంజాబ్-చండీగఢ్ సరిహద్దు వద్ద తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పెద్ద ఎత్తున చొచ్చుకువచ్చిన రైతులను అడ్డుకునేందుకు పోలీసులు బాష్పవాయువు గోళాలు ప్రయోగించారు. దీంతో రైతులు చెల్లాచెదురై పరిగెడుతున్న వీడియోలు బయటకు వచ్చాయి.

తమ సమస్యల పరిష్కారం కోసం కేంద్రమంత్రులతో గత రాత్రి రైతులు జరిపిన చర్చలు అపరిష్కృతంగా మిగిలిపోవడంతో ఢిల్లీ ముట్టడికి వెళ్లాలని 200 రైతు సంఘాలు నిర్ణయించాయి. ముఖ్యమైన డిమాండ్ల పరిష్కారం విషయంలో ప్రభుత్వం ఓ నిర్ణయానికి రాలేకపోవడం, అదే సమయంలో రైతులు వెనక్కి తగ్గకపోవడంతో గంటలపాటు జరిగిన చర్చలు విఫలమయ్యాయి. 

రైతుల ‘ఢిల్లీ చలో’ ఆందోళన నేపథ్యంలో ఢిల్లీ పోలీసులు భద్రతను కట్టుదిట్టం చేశారు. పలు ఆంక్షలు విధించారు. ఢిల్లీని ఆనుకుని వున్న శాటిలైట్ టౌన్స్‌లో పలు చోట్ల ట్రాఫిక్‌ను మళ్లిస్తున్నారు. దీంతో ఘజియాపూర్, చిల్లా సరిహద్దుల వద్ద భారీగా ట్రాఫిక్ నిలిచిపోయింది. కాగా, ఈ ఉదయం 10 గంటలకు ఢిల్లీ చలో మార్చ్ ప్రారంభమైంది. పంజాబ్‌లోని సంగ్రూర్ నుంచి 2500 ట్రాక్టర్లతో రైతులు హర్యానా మీదుగా ఢిల్లీకి బయలుదేరారు.


More Telugu News