రైతుల ‘ఛలో ఢిల్లీ’ వేళ.. అపరిష్కృతంగా ఉన్న డిమాండ్లు ఇవేనా?

  • పంటలకు కనీస మద్దతు ధరపై స్పష్టమైన హామీతో చట్టం చేయాలని కోరుతున్న రైతు సంఘాలు
  • ప్రధాన డిమాండ్లలో విద్యుత్ చట్టం 2020 రద్దు, లఖింపూర్ ఖేరీ ఘటనలో మృతి చెందిన రైతుల కుటుంబాలకు పరిహారం
  • ప్రభుత్వం హామీలు నెరవేర్చకపోవడంపై నిరసన వ్యక్తం చేస్తున్న రైతులు
 రైతు సంఘాల నాయకులతో కేంద్ర మంత్రుల బృందం సుమారు 5 గంటలపాటు జరిపిన చర్చలు అసంపూర్తిగా ముగియడంతో 'ఢిల్లీ ఛలో' మార్చ్‌ నిర్వహించేందుకు అన్నదాతలు సిద్ధమయ్యారు. నేడు (మంగళవారం) ఢిల్లీలో నిర్వహించ తలపెట్టిన ఈ ధర్నా కోసం పంజాబ్, హర్యానా, యూపీ సహా దేశంలోని వివిధ ప్రాంతాలకు చెందిన రైతు సంఘాల నాయకులు, రైతులు పెద్ద సంఖ్యలో రాజధాని ఢిల్లీకి చేరుకుంటున్నారు. 250కి పైగా రైతు సంఘాల మద్దతున్న ‘కిసాన్ మజ్దూర్ మోర్చా’, దాదాపు 150 సంఘాలతో కూడిన ‘కిసాన్ మోర్చా’ డిసెంబర్‌లోనే నిరసనకు పిలుపునివ్వడంతో పెద్ద సంఖ్యలో ఢిల్లీకి తరలివెళ్తున్నారు. దీంతో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఢిల్లీ పోలీసులు అప్రమత్తమయ్యారు. బారికేడ్లతో నగర సరిహద్దులను మూసివేశారు. ర్యాలీలు, నిరసనలపై నిషేధం విధించారు. ఈ నేపథ్యంలో అపరిష్కృతంగా ఉన్న రైతుల ప్రధాన డిమాండ్లు ఏమిటన్నది ఒకసారి పరిశీలిద్దాం..

ఈ డిమాండ్లలో ప్రధానమైనది.. పంటలకు కనీస మద్దతు ధరకి హామీ ఇచ్చే చట్టం చేయాలన్నది. మార్కెట్‌లో అనిశ్చితితో సంబంధం లేకుండా కనీస మద్దతు ధరకు హామీ లభించాలని రైతులు కోరుతున్నారు. విద్యుత్ చట్టం 2020 రద్దు, లఖింపూర్ ఖేరీ ఘటనలో మృతి చెందిన రైతులకు నష్టపరిహారం చెల్లింపు, రైతు ఉద్యమంలో పాల్గొన్న వారిపై కేసుల ఉపసంహరణ రైతుల ప్రధాన డిమాండ్లుగా ఉన్నాయి. రెండేళ్ల క్రితం పలు డిమాండ్ల పరిష్కారానికి కేంద్రం హామీ ఇచ్చినా నెరవేర్చకపోవడంతో ధర్మా చేపట్టాలని రైతులు నిర్ణయించారు. 

2020-21 రైతు ఆందోళన సమయంలో రైతులపై నమోదయిన కేసుల ఉపసంహరణకు కేంద్ర ప్రభుత్వం సుముఖత వ్యక్తం చేసినప్పటికీ.. తమ డిమాండ్లలో అత్యంత ముఖ్యమైన ‘కనీస మద్దతు ధర’కు’ హామీ ఇవ్వాలని రైతులు పట్టుబడుతున్నారు. ఇక ప్రభుత్వం ఇచ్చిన హామీలు నెరవేర్చే విషయంలో ప్రభుత్వ నిబద్ధతపై రైతు సంఘాల నాయకులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. కనీస మద్దతు ధర, రుణమాఫీ డిమాండ్ల విషయంలో స్వామినాథన్‌ కమిషన్‌ సిఫార్సుల అమలును పరిశీలించేందుకు కేంద్రం ఒక కమిటీని ప్రతిపాదించింది. అయినప్పటికీ రైతులు వెనక్కి తగ్గడం లేదు. ఇక భూసేకరణ చట్టం-2013 పునరుద్దరణ, ప్రపంచ వాణిజ్య సంస్థ నుంచి ఉపసంహరణ కూడా రైతుల డిమాండ్లలో ప్రధానమైనవిగా ఉన్నాయి.


More Telugu News