పిల్లల కిడ్నాపర్‌గా భావించి అమాయకుడిని కొట్టి చంపిన జనాలు

  • నిజామాబాద్ పట్టణంలో సోమవారం ఘటన
  • అమ్మవారిని పూజించేందుకు చీరకట్టుకుని వెళ్లిన పశువుల కాపరి
  • నిందితులపై మర్డర్ కేసు నమోదు చేసిన పోలీసులు
పిల్లల కిడ్నాపర్లు సంచరిస్తున్నారన్న వందతులతో విచక్షణ కోల్పోయి కొందరు ఓ అమాయకుడిని కిడ్నాపర్‌గా అనుమానించి ఇష్టారీతిన కొట్టి చంపేశారు. నిజామాబాద్ జిల్లాలో సోమవారం ఈ ఘటన చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, జిల్లా శివారు గ్రామం ఖానాపూర్ గ్రామానికి చెందిన రాజు పశువుల కాపరి. దుర్గామాతకు వీరభక్తుడైన అతడికి చీరకట్టులో అమ్మవారిని అర్చించడం అలవాటు. కాగా, సోమవారం పట్టణంలోని భీమరాయి గుడిలో పూజలు చేయడానికి రాజు ఉదయం ఐదున్నరకే బయలుదేరాడు.

ఈ క్రమంలో అతనిని గమనించిన గ్రామస్తులు అతడిని కిడ్నాపర్ గా పొరబడ్డారు. రాజు చీరకట్టులో ఉండటంతో వారి అనుమానం పెనుభూతమైంది. రాజును పట్టుకుని ప్రశ్నలతో ఉక్కిరిబిక్కిరి చేశారు. తాను పశువుల కాపరినని చెబుతున్నా వినకుండా అతడిని కర్రలతో ఇష్టారీతిన కొట్టారు. దెబ్బలు తాళలేక అతడు అపస్మారకస్థితిలోకి వెళ్లిపోవడంతో డయల్ 100కు ఫోన్ చేసి సమాచారం అందించారు. అయితే, ఆసుపత్రికి తరలించిన కొద్దిసేపటికే అతడు మరణించాడు. 

ఘటనపై నిజామాబాద్ సీపీ కల్మెశ్వర్ సీరియస్ అయ్యారు. రాజుపై దాడి చేసిన వారిలో ఐదుగురిపై మర్డర్ కేసు పెట్టినట్టు చెప్పారు. ఇటీవల అక్కడ జరిగిన కిడ్నాపులకు ఒకదానితో మరొకటికి సంబంధం లేదన్నారు. వీటి వెనుక గ్యాంగ్‌లేవీ లేవని కూడా భరోసారి ఇచ్చారు. కిడ్నాపైన చిన్నారులను వెతికిపట్టుకుని వారివారి తల్లిదండ్రులకూ అప్పగించామన్నారు. చట్టాన్ని ఎవరూ చేతుల్లోకి తీసుకోవద్దని వార్నింగ్ ఇచ్చారు.


More Telugu News