ఇలాంటి బౌలర్ ఉంటే ప్రతి బంతికీ వికెట్టే!

  • కువైట్ క్రికెట్ పోటీల్లో ఆశ్చర్యకర ఘటన
  • పాములా మెలికలు తిరుగుతూ వచ్చి బంతిని వేసిన బౌలర్
  • భారీగా స్పిన్నయిన బంతి... క్లీన్ బౌల్డ్ అయిన బ్యాట్స్ మన్
సోషల్ మీడియాలో ఇప్పుడో వీడియో వైరల్ అవుతోంది. కువైట్ క్రికెట్ పోటీల సందర్భంగా ఏమాత్రం నమ్మశక్యం కాని ఘటన చోటుచేసుకుంది.

ఓ స్పిన్ బౌలర్ పాములా మెలికలు తిరుగుతూ విసిరిన బంతి... పిచ్ పై పడిన తర్వాత అంతకంటే ఎక్కువ స్పిన్ తిరిగి వికెట్లను తాకింది. ఆ బంతికి తాను బౌల్డ్ అవుతానని ఏమాత్రం ఊహించలేని ప్రత్యర్థి జట్టు బ్యాట్స్ మన్ తీవ్ర నిరాశతో క్రీజును వదలి వెళ్లిపోవడం వీడియోలో చూడొచ్చు. 

ఎక్స్ లో ఈ వీడియోపై కామెంట్లు మామూలుగా లేవు. ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరూ విస్మయానికి గురవుతున్నారు. ఓ స్పిన్నర్ ఈ స్థాయిలో బంతిని టర్న్ చేయడం అద్భుతం అని కొనియాడుతున్నారు. ముత్తయ్య మురళీధరన్ వంటి స్పిన్ దిగ్గజం కూడా ఈ వీడియో చూస్తే ఆశ్చర్యపోతాడని నెటిజన్లు వ్యాఖ్యానిస్తున్నారు. ఈ ఒక్క బౌలర్ లో హర్భజన్ రనప్, మురళీధరన్ బౌలింగ్ యాక్షన్, షేన్ వార్న్ టర్న్ కనిపిస్తున్నాయని ఓ నెటిజన్ పేర్కొన్నాడు.

ఈ శతాబ్దానికి ఇదే అత్యుత్తమ బాల్ అని మరో నెటిజన్... ఇలా తలో రకంగా స్పందిస్తున్నారు. కొందరైతే అది నోబాల్ అని, నిబంధలనకు విరుద్ధంగా బంతిని త్రో చేశాడని విమర్శిస్తున్నారు.


More Telugu News