వీళ్లిద్దరూ ఉత్తరాంధ్రను పందికొక్కుల్లా దోచేస్తున్నారు: నారా లోకేశ్

  • శ్రీకాకుళం నియోజకవర్గంలో లోకేశ్ శంఖారావం 
  • టీడీపీ అంటే కార్యకర్తలేనని స్పష్టీకరణ
  • జగన్ ఉత్తరాంధ్రను విజయసాయి, వైవీ సుబ్బారెడ్డిలకు అప్పగించేశాడని వ్యాఖ్యలు
  • తాము వచ్చాక వాళ్లిద్దరి పనిబడతామని హెచ్చరిక
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ నేడు కూడా శ్రీకాకుళం జిల్లాలో శంఖారావం యాత్ర కొనసాగించారు. తొలుత నరసన్నపేట నియోజకవర్గం సభలో పాల్గొన్న నారా లోకేశ్, ఈ సాయంత్రం శ్రీకాకుళం నియోజకవర్గంలో సభకు హాజరయ్యారు. 

 ఈ సభలో ఆయన ప్రసంగిస్తూ... టీడీపీ అంటే కార్యకర్తలేనని స్పష్టం చేశారు. కొందరు నేతలు వచ్చారు, వెళ్లారు... కానీ పార్టీకి అప్పుడూ, ఇప్పుడూ, ఎప్పుడూ అండగా ఉండేది కార్యకర్తలు మాత్రమేనని కొనియాడారు. 

"ఏపీలో జగన్ పనైపోయింది. ఈ మాట నేను కాదు, వైసీపీ ఎంపీలే చెబుతున్నారు. 25 మంది ఎంపీలను ఇస్తే కేంద్రం మెడలు వంచి ప్రత్యేక హోదా తీసుకువస్తానని అన్నాడు. ప్రధానమంత్రిని ఎన్నిసార్లు కలిశాడు? ఒక్కసారైనా ప్రత్యేక హోదా గురించి అడిగాడా? 

లోక్ సభలో 22 మంది సభ్యులు, రాజ్యసభలో 9 మంది సభ్యులు ఉన్నారు... పార్లమెంటులో వైసీపీకి 31 మంది సభ్యులు ఉన్నారు కానీ, వారు రాష్ట్రం కోసం పోరాడడంలేదు. తమను సొంత కేసుల కోసం తాకట్టు  పెట్టాడని ఆ పార్టీ ఎంపీలో చెబుతున్నారు. అందుకే బై బై జగన్ అంటున్నారు. మరో రెండు నెలల్లో ఎన్నికలు వస్తున్నాయి... అందుకే ప్రజలు కూడా బై బై జగన్ అనాలి. 

జగన్ ప్రపంచంలో ఎక్కడా లేని స్కీమ్ తీసుకువచ్చాడు. తమ నియోజకవర్గంలో చెత్త అని తేలిన ఎమ్మెల్యేలను పక్క నియోజకవర్గానికి తీసుకువస్తున్నాడు. గత ఎన్నికల ముందు జగన్ అనేక నాటకాలు ఆడాడు. సొంత కార్యకర్తతో కోడికత్తితో పొడిపించుకున్నాడు. బాబాయ్ ని చంపేశాడు. వాటన్నింటినీ మనపై వేశాడు. ఇప్పుడు వాటిని తిప్పికొట్టాల్సిన సమయం వచ్చింది. 

జగన్ ఇసుకే తింటాడు. ఇసుకపై కోట్ల రూపాయలు భోంచేస్తున్నాడు. అన్ని పన్నులు పెంచి ప్రజలపై బాదుడే బాదుడు అమలు చేస్తున్నాడు. మద్యం క్వార్టర్ బాటిళ్లపైనా భారీగా వసూలు చేస్తున్నాడు. భారతదేశ చరిత్రలోనే 100 సంక్షేమ పథకాలు రద్దు చేసిన వ్యక్తి జగన్" అంటూ నారా లోకేశ్ ధ్వజమెత్తారు. 

చంద్రబాబు, పవనన్న కలిసి 'బాబు సూపర్-6' ప్రకటించారు

ప్రజల కష్టాలు మనం చూశాం. ఆ కష్టాలు తొలగిపోయేలా చంద్రబాబు, పవనన్న కలిసి బాబు సూపర్-6 ప్రకటించారు. 

1. మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఐదేళ్లలో 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తాం. 

2. ఉద్యోగం వచ్చే వరకు సమయం పడితే, ప్రతి నిరుద్యోగ  యువతీయువకులకు నెలకు రూ.3 వేలు చెల్లిస్తాం. 

3. స్కూలుకు వెళ్లే విద్యార్థులకు ఏడాదికి రూ.15 వేలు ఇస్తాం. ఒక పిల్లవాడు స్కూలుకు వెళితే రూ.15 వేలు, ఇద్దరు వెళితే రూ.30 వేలు, ముగ్గురు వెళితే రూ.45 వేలు ఇస్తాం. 

4. ఇబ్బందుల్లో ఉన్న రైతన్నను ఆదుకునేందుకు ప్రతి ఏడాది రూ.20 వేలు ఇస్తాం. 

5. ప్రతి కుటుంబానికి ఉచితంగా 3 గ్యాస్ సిలిండర్లు ఇవ్వబోతున్నాం. 

6. రాష్ట్రంలో 18 ఏళ్ల నుంచి 59 ఏళ్ల వయసున్న మహిళలకు ప్రతి నెల రూ.1500 అందజేస్తాం. ఏడాదికి రూ.18 వేలు, ఐదేళ్లకు రూ.90 వేలు మన ప్రభుత్వం మహిళలకు ఇవ్వబోతోంది. 

ఉత్తరాంధ్రకు పట్టిన శని... జగన్!

జగన్ ఉత్తరాంధ్రకు పట్టిన శని. జగన్ ప్రైవేటు సంస్థలతో ఒప్పందం కుదుర్చుకుని విశాఖ ఉక్కు పరిశ్రమను ప్రైవేటీకరణ చేయడానికి ప్రయత్నిస్తున్నాడు. ఈ ప్రయత్నాన్ని మేం అడ్డుకుంటాం. అవసరమైతే రాష్ట్ర ప్రభుత్వమే ఉక్కు పరిశ్రమను కొనుగోలు చేసి, పెద్ద ఎత్తున ఉద్యోగ అవకాశాలు కల్పిస్తాం. 

జగన్ ఇద్దరు వ్యక్తులకు ఉత్తరాంధ్రను అప్పగించేశాడు. ఆ ఇద్దరు ఒకరు విజయసాయిరెడ్డి, మరొకరు వైవీ సుబ్బారెడ్డి. వీళ్లిద్దరూ పందికొక్కుల్లా ఉత్తరాంధ్రను దోచేస్తున్నారు. ఎక్కడ భూమి కనపడినా కబ్జా చేస్తున్నారు, ఎక్కడ మైన్ కనబడినా సొంతం చేసుకుంటున్నారు. మేం అధికారంలోకి వచ్చాక వాళ్లిద్దరి పనిబడతాం... అంటూ లోకేశ్ హెచ్చరించారు.


More Telugu News