అసెంబ్లీకి రాని కేసీఆర్‌ రేపు నల్గొండ సభకు వెళతారా?: మల్లు భట్టి విక్రమార్క

  • కృష్ణా జలాలపై అసెంబ్లీలో చర్చించి, తీర్మానం చేసి కేంద్రానికి పంపిద్దామంటే ప్రతిపక్ష నేత రాలేదన్న మల్లు భట్టి
  • ఈఎన్సీ మురళీధరరావు రిటైర్ అయినప్పటికీ పదేళ్లు కొనసాగించారంటూ విమర్శ
  • కృష్ణా జలాలపై హరీశ్ రావు సభను తప్పుదోవ పట్టించారన్న ఉపముఖ్యమంత్రి
అసెంబ్లీకి రాని వ్యక్తి... రేపు నల్గొండలో సభకు వెళతారా? అని తెలంగాణ ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌ను ఉద్ధేశించి అన్నారు. సోమవారం అసెంబ్లీలో కృష్ణా జలాలపై చర్చ సందర్భంగా భట్టివిక్రమార్క మాట్లాడారు. కృష్ణా జలాలపై అసెంబ్లీలో చర్చించి, తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపిద్దామనుకుంటే... ప్రధాన ప్రతిపక్ష నేత కేసీఆర్ సభకు రాలేదని విమర్శించారు. అసెంబ్లీకి రాని వ్యక్తి రేపు బహిరంగ సభకు వెళతారా? అని ఎద్దేవా చేశారు.

ఈఎన్సీ మురళీధరరావు చేత బీఆర్ఎస్ తమకు అనుకూలంగా మాట్లాడించిందని ఆయన ఆరోపించారు. రిటైర్ అయినప్పటికీ ఆయనను పదేళ్లు బీఆర్ఎస్ ప్రభుత్వం కొనసాగించిందని విమర్శించారు. కృష్ణా జలాలపై చర్చ సందర్భంగా హరీశ్ రావు సభను తప్పుదోవ పట్టించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వంలో బీఆర్ఎస్ ఏజెంట్లు చాలామంది ఉన్నారని... వారిపై త్వరలో చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.


More Telugu News