మేం బాగానే ప్రిపేరయ్యాం కానీ.. అండర్-19 ప్రపంచకప్ ఫైనల్‌లో ఓటమిపై స్కిప్పర్ ఉదయ్ సహరాన్

  • వ్యూహాలను అమలు చేయడంలో విఫలమయ్యామన్న ఉదయ్
  • అదే తమ కొంప ముంచిందని ఆవేదన
  • ఫైనల్‌లో ఓడినప్పటికీ మొత్తంగా బాగానే ఆడామన్న కెప్టెన్
అండర్-19 ప్రపంచకప్ ఫైనల్‌లో ఆస్ట్రేలియా చేతిలో 79 పరుగుల తేడాతో ఓడిన భారత యువజట్టు మరోమారు దారుణంగా నిరాశపరిచింది. ఆస్ట్రేలియా నిర్దేశించిన 254 పరుగుల విజయ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో భారత కుర్రాళ్లు 43.5 ఓవర్లలో 174 పరుగులకే ఆలౌటయ్యారు. ఓపెనర్ ఆదర్శ్ సింగ్ (47), నంబర్ 8లో మురుగన్ అభిషేక్ (42) మాత్రమే పోరాట పటిమ కనబర్చారు. మిగతా వారు క్రీజులోకి వచ్చినట్టే వచ్చి వెనుదిరిగారు.

లీగ్ దశలో గొప్పగా చివరి మెట్టుపై చతికిలపడడంపై టీమిండియా అండర్-19 జట్టు కెప్టెన్ ఉదయ్ సహరాన్ స్పందించాడు. బ్యాటర్లు తమ వ్యూహాలను అమలు చేయడంలో విఫలమయ్యారని, అదే తమ కొంప ముంచిందని ఆవేదన వ్యక్తం చేశాడు. తాము కొన్ని ర్యాష్ షాట్లు ఆడామని, క్రీజులో ఎక్కువ సేపు కుదురుకోలేకపోయామని తెలిపాడు. ఫైనల్ కోసం తాము బాగానే సన్నద్ధమైనప్పటికీ దానిని అమలు చేయడంలో మాత్రం విఫలమయ్యామని పేర్కొన్నాడు. ఫైనల్‌లో ఓడినప్పటికీ మొత్తంగా టోర్నీలో బాగానే ఆడామని, కుర్రాళ్లు రాణించారని ప్రశంసించాడు. టోర్నీ ప్రారంభం నుంచే పోరాట పటిమ చూపినందుకు గర్వంగా ఉందని పేర్కొన్నాడు.


More Telugu News