ప్రతిపక్షాలు ప్రజల్ని భయాందోళనలకు గురిచేసేలా వ్యవహరిస్తున్నాయి: ఏపీ మంత్రి విడదల రజని

  • నిందలు వేయాలంటే వేయండంటూ విపక్షాలపై మండిపాటు
  • అధికారులు సక్రమంగానే విధులు నిర్వహిస్తున్నారని సమర్థన
  • కలుషిత నీరు సరఫరా అవుతోందంటూ విపక్షాలు నిందలు వేస్తున్నాయంటూ ఆగ్రహం
  • గుంటూరు కలెక్టరేట్‌లో నగరపాలక, వైద్య, ఆరోగ్యశాఖ అధికారులతో తాగునీటి సరఫరాపై మంత్రి విడదల సమీక్ష
గుంటూరు కలెక్టరేట్‌లో నగరపాలక, వైద్య, ఆరోగ్యశాఖ అధికారులతో తాగునీటి సరఫరాపై ఏపీ మంత్రి విడదల రజని ఆదివారం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, ప్రతిపక్షాలు ప్రజల్ని భయాందోళనలకు గురిచేసేలా వ్యవహరిస్తున్నాయని మండిపడ్డారు. అధికారులు సక్రమంగా విధులు నిర్వహిస్తున్నప్పటికీ దుష్ర్పచారం చేస్తున్నారని, నిందలు వేయాలనుకుంటే వేయొచ్చని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. గత 10 రోజులుగా కలుషిత నీరు సరఫరా అవుతోందంటూ ప్రతిపక్షాలు చెబుతున్నాయని విలేకర్లు ప్రస్తావించగా విడదల రజని ఈ విధంగా స్పందించారు. అధికారులు ఏమైనా తప్పిదాలు చేస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. వైద్యసేవలు అందని బాధితులు 8341396104 నంబరుకు ఫోన్‌ ద్వారా ఫిర్యాదు చేయాలని సూచించారు.

వాంతులు, విరేచనాలతో హాస్పిటల్స్‌లో చేరిన బాధితులకు మెరుగైన వైద్యసేవలు అందించేలా అప్రమత్తం చేశామని మంత్రి తెలిపారు. వీళ్లంతా డయేరియాతో బాధపడుతున్నారా? లేదా? అనేది ల్యాబ్‌ రిపోర్ట్ వచ్చిన తర్వాత నిర్ధారణ అవుతుందన్నారు. శనివారం నుంచి చికిత్స పొందుతున్న వారిలో ఏడుగురు డిశ్ఛార్జ్‌ అయ్యారని తెలిపారు. మేడికొండూరు, సిరిపురం, పేరేచర్ల, పల్నాడు జిల్లా గురజాల, నరసరావుపేట తదితర ప్రాంతాలకు చెందిన 41 మంది బాధితులు ఆసుపత్రిలో చేరారని వెల్లడించారు. ఇక ఇటీవలే చనిపోయిన పద్మ కుటుంబానికి నష్టపరిహారం చెల్లిస్తారా? అని ప్రశ్నించగా.. రిపోర్టు ఆధారంగా నిర్ణయం ఉంటుందని మంత్రి స్పష్టం చేశారు.


More Telugu News