టీడీపీ నుంచి వచ్చిన లక్షణాలు సీఎంలో ఇంకా పోయినట్టు లేదు: బీఆర్ఎస్ నేత వినోద్ కుమార్

  • తెలంగాణ చిహ్నం నుంచి కాకతీయ కళాతోరణం తొలగించే కుట్ర చేస్తున్నారన్న వినోద్
  • ఎవరో చెప్పిన వాటిని నమ్మి సీఎం ఇలా చేయడం సరికాదన్న వినోద్
  • సీఎం హోదాలో ఉన్న వ్యక్తి హుందాగా వ్యవహరించాలని హితవు  
బీఆర్ఎస్ నేత బోయినపల్లి వినోద్ కుమార్ నేడు కాంగ్రెస్ ప్రభుత్వంపై ధ్వజమెత్తారు. తెలంగాణ చిహ్నంలోని చార్మినార్, కాకతీయ కళాతోరణం గుర్తులను తొలగించేందుకు సీఎం కుట్ర చేస్తున్నారని మండిపడ్డారు. చార్మినార్, కాకతీయ కళాతోరణం రాచరికపు చిహ్నాలంటూ ముఖ్యమంత్రి పీఠం నుంచి రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించడం దేన్ని సూచిస్తోంది? అని వినోద్ కుమార్ ప్రశ్నించారు. 

11, 12 శతాబ్దాల్లో దక్షిణ భారతదేశ పాలకులుగా ఖ్యాతి గడించిన కాకతీయులు రాచరికం నుంచి వచ్చిన వాళ్లు కాదని స్పష్టం చేశారు. వారు పేదల కోసం పాటుపడిన మహనీయులు అని కొనియాడారు. కాకతీయుల ఘనచరిత్రకు నిలువెత్తు నిదర్శనం కాకతీయ కళాతోరణం అని పేర్కొన్నారు. 

దేశానికి స్వాతంత్ర్యం వచ్చాక సారనాథ్ స్థూపం నుంచి 3 సింహాల గుర్తును, అశోక చక్రం చిహ్నాలను భారతదేశ అధికారిక చిహ్నంలోకి తీసుకున్నారని, మరి అవి రాచరిక వ్యవస్థకు సంకేతాలు కాదా? అని వినోద్ ప్రశ్నించారు. సీఎంకు ఇంకా టీడీపీ నుంచి వచ్చిన లక్షణాలు పోయినట్టు లేదని అన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ భాష, యాస, వ్యవసాయం, చరిత్రను తుడిచేయాలని ఆంధ్రా పాలకులు భావించారని, ఇప్పుడు ఈ ముఖ్యమంత్రి కూడా వాళ్లలాగానే ఆలోచిస్తున్నాడని విమర్శించారు. 

ముఖ్యమంత్రి హోదాలో ఉన్న వ్యక్తి హుందాగా ఉండాలి... ఎవరో చెప్పిన వాటిని విని ఈ విధంగా వ్యవహరించడం సరికాదని హితవు పలికారు. కాకతీయులు  పాలించిన వరంగల్ నుంచి మంత్రులుగా ఉన్న సీతక్క, కొండా సురేఖ సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై స్పందించాలని డిమాండ్ చేశారు.


More Telugu News