నా అంత అదృష్టవంతుడు ఎవరూ ఉండరు: అచ్చెన్నాయుడు

  • ఉత్తరాంధ్రలో నారా లోకేశ్ శంఖారావం
  • శ్రీకాకుళం జిల్లా టెక్కలిలో సభ
  • హాజరైన లోకేశ్, అచ్చెన్నాయుడు 
  • టెక్కలిలో 50 వేల మెజారిటీ రావాలంటూ పిలుపునిచ్చిన అచ్చెన్న 
శ్రీకాకుళం జిల్లా టెక్కలిలో టీడీపీ శంఖారావం సభ ప్రారంభమైంది. ఈ సభకు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్, టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు, ఇతర నేతలు హాజరయ్యారు. 

ఈ సభలో అచ్చెన్నాయుడు ప్రసంగిస్తూ... ఉత్తరాంధ్ర ప్రజలు న్యాయానికి, ధర్మానికి కట్టుబడి ఉంటారని కొనియాడారు. టెక్కలిలో ఈసారి టీడీపీ మెజారిటీ 50 వేలు రావాలని పిలుపునిచ్చారు. 

తాను టీడీపీకి రాష్ట్ర అధ్యక్షుడిగా ఉండడం వల్ల అనేక పనులతో బిజీగా ఉంటానని, కొన్ని సార్లు నియోజకవర్గానికి రాలేని పరిస్థితులు ఉంటాయని తెలిపారు. అయినప్పటికీ తనంతటి అదృష్టవంతుడు ఎవరూ లేరని, తాను ఎప్పుడు పిలుపునిచ్చినా టెక్కలి ప్రజలు భారీగా తరలి వస్తారంటూ వారికి కృతజ్ఞతలు తెలిపారు. రాష్ట్రంలో టాప్-3 మెజారిటీ వచ్చే నియోజకవర్గాల్లో టెక్కలి నిలవడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. 

టెక్కలిలో జరిగిన అభివృద్ధి టీడీపీ వల్లనే అని స్పష్టం చేశారు. లోకేశ్ సహకారంతో టెక్కలిలో ఇంటింటికీ కుళాయి ద్వారా నీళ్లు ఇచ్చానని అచ్చెన్నాయుడు వెల్లడించారు. టీడీపీ హయాంలో 72 శాతం వంశధార ప్రాజెక్టు  పూర్తి చేశామని తెలిపారు. వైసీపీ హయాంలో వంశధార మట్టితో నిండిపోయిందని విమర్శించారు. 

ఈసారి ఎన్నికల్లో టీడీపీకి ఎదురులేదని, మొత్తం 175 స్థానాల్లో విజయభేరి మోగిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. పులివెందులలోనూ టీడీపీ జెండా ఎగురవేస్తామని స్పష్టం చేశారు. ఎక్కడికి వెళ్లినా ప్రజలు తమకు అనుకూలంగా ఉన్నారని, వైసీపీని అసహ్యించుకుంటున్నారని అచ్చెన్నాయుడు పేర్కొన్నారు. సీఎం జగన్ రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారని విమర్శించారు. సీఎం జగన్ 11 లక్షల కోట్లు అప్పులు తెచ్చారని ఆరోపించారు.


More Telugu News