కొడుకునంటూ తిరిగొచ్చిన సన్యాసి.. అసలు సన్యాసే కాదట.. వైరల్ వీడియో ఇదిగో!

  • పదకొండేళ్ల వయసులో వెళ్లిపోయి 22 ఏళ్ల వయసులో సన్యాసిగా తిరిగొచ్చిన కొడుకు
  • ఇటీవల సోషల్ మీడియాలో వైరల్ గా మారిన వీడియో
  • ఇంటికి తిరిగి రావాలంటే రూ.10 లక్షలు మఠానికి చెల్లించాలన్న యువకుడు
  • పొలం అమ్మేసి డబ్బు కట్టేందుకు సిద్ధపడ్డ తండ్రి.. ఇంతలో బయటపడ్డ మోసం
పదకొండేళ్ల వయసులో ఇంట్లోంచి వెళ్లిపోయిన కొడుకు 22 ఏళ్ల వయసులో సన్యాసిగా తిరిగొచ్చాడంటూ ఇటీవల వైరల్ గా మారిన వీడియో వెనక కొత్త కోణం బయటపడింది. కొడుకునంటూ వచ్చిన ఆ సన్యాసి వాళ్ల కొడుకే కాదని, అసలు సన్యాసే కాదని తేలింది. సన్యాసి వేషం కట్టి జనాలను మోసం చేస్తున్నారని తేలడంతో బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇటీవల సోషల్ మీడియాలో వైరల్ గా మారిన ఈ ఘటనకు సంబంధించిన వివరాలు..

అమేథికి చెందిన భానుమతి, రాతిపాల్ సింగ్ దంపతులు ఢిల్లీకి వలస వెళ్లారు. కూలిపనులతో పాటు దొరికిన పని చేసుకుంటూ పొట్టపోసుకుంటున్నారు. పదకొండేళ్ల క్రితం భానుమతి, రాతిపాల్ సింగ్ కొడుకు పింకూ ఇంట్లోంచి వెళ్లిపోయాడు. ఎన్నిచోట్ల వెతికినా దొరకకపోవడంతో ఆ దంపతులు కొడుకుపై ఆశ వదిలేసుకున్నారు. అయితే, ఏనాటికైనా పింకూ తిరిగొస్తాడని భానుమతి నమ్ముతుండేది. ఈ క్రమంలోనే కిందటి నెలలో బంధువుల నుంచి భానుమతికి ఓ ఫోన్ కాల్ వచ్చింది. పింకూ తమకు కనిపించాడని, అమేథీలోని ఖారౌలీ (రాతిపాల్ సొంతూరు) కి వస్తున్నాడని చెప్పడంతో భర్తతో కలిసి భానుమతి హుటాహుటిన సొంతూరుకు చేరుకుంది.

అక్కడ సన్యాసి రూపంలో వచ్చిన యువకుడిని తన కొడుకుగా గుర్తించింది. శరీరంపై ఉన్న ఓ మచ్చ ఆధారంగా ఆ సన్యాసి తన కొడుకేనని పోల్చుకుంది.  ఇన్నేళ్ల తర్వాత కొడుకును చూసిన ఆ తల్లి కన్నీటిపర్యంతమైంది. తమతో పాటే ఉండిపోవాలని భానుమతి కోరినా.. సన్యాసి కుదరదని చెప్పాడు. ఇంట్లో నుంచి వెళ్లిపోయాక జార్ఖండ్ లోని పరస్ నాథ్ మఠంలో చేరానని, కుటుంబ జీవితం పట్ల తనకు ఆసక్తి లేదని చెప్పాడు. జన్మనిచ్చిన తల్లి చేతుల మీదుగా భిక్ష తీసుకుంటేనే సన్యాస దీక్ష పూర్తయినట్లు తమ మఠం నమ్మకమని, తనకు భిక్ష వేయాలని కోరాడు. ఈ తల్లీ కొడుకుల కథ ఖరౌలీ గ్రామస్థులను కదిలించింది. ఊరు ఊరంతా చందాలు పోగేసి 13 క్వింటాళ్ల ధాన్యాన్ని భిక్షగా సమర్పించారు. రాతిపాల్ సింగ్ సోదరి రూ.11 వేలు అందించింది. కొడుకుకు ఓ ఫోన్ ఇచ్చిన రాతిపాల్ సింగ్.. అప్పుడప్పుడూ ఫోన్ చేయమని కోరాడు.

ఈ ఘటన జరిగిన తర్వాత మూడు నాలుగు రోజులకు రాతిపాల్ సింగ్ కు పింకూ ఫోన్ చేశాడు. తనకూ ఇంటికి వచ్చేయాలని ఉందని, కానీ సన్యాస దీక్ష వదిలేసి కుటుంబంతో కలిసిపోవాలంటే తన మఠానికి పరిహారంగా డబ్బులు కట్టాలని చెప్పారు. ఇందుకు రూ.11 లక్షలు అడుగుతున్నారని చెప్పగా.. రాతిపాల్ సింగ్ తన పొలం అమ్మేసి డబ్బు సిద్ధం చేశాడు. జార్ఖండ్ కు వచ్చి మఠం పెద్దలను కలిసి ఆ డబ్బు అందజేస్తానని చెప్పగా.. పింకూ వద్దన్నాడు. రకరకాల కారణాలు చెబుతూ రాతిపాల్ సింగ్ జార్ఖండ్ రాకుండా అడ్డుకున్నాడు. దీంతో అనుమానించిన రాతిపాల్ సింగ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

విచారణలో బయటపడ్డ నిజాలు చూసి రాతిపాల్ సింగ్ కుటుంబమే కాదు గ్రామస్థులు కూడా నివ్వెరపోయారు. గ్రామానికి వచ్చిన సన్యాసి పింకూ కాదని, అసలు ఆ యువకుడు సన్యాసే కాదని పోలీసుల విచారణలో తేలింది. ఆ సన్యాసి అసలు పేరు మహ్మద్ నఫీస్ అని, ఇలా తప్పిపోయిన పిల్లల తల్లిదండ్రులను మోసం చేయడమే వారి పనని బయటపడింది. నఫీస్ సోదరుడు కూడా ఇదే తరహాలో ఓ కుటుంబాన్ని వంచించి, రూ.లక్షల డబ్బు చేజిక్కించుకుని పారిపోయాడని పోలీసులు చెప్పారు. కాగా, రాతిపాల్ సింగ్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని విచారణ జరుపుతున్నట్లు ఖరౌలీ పోలీసులు తెలిపారు.


More Telugu News