మోసం.. దగా.. కుట్రలకు ప్యాంటూ షర్టు తొడిగితే జగన్: నారా లోకేశ్

  • ఎన్నికల ముందు 6 వేల పోస్టులతో డీఎస్సీ వేశారని ప్రభుత్వంపై మండిపాటు
  • టీడీపీ అధికారంలోకి వచ్చాక ఏటా డీఎస్సీ నిర్వహిస్తామని వెల్లడి
  • శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురంలో శంఖారావం యాత్ర ప్రారంభించిన యువనేత
తెలుగుదేశం పాలనలో ఉత్తరాంధ్రను జాబ్ క్యాపిటల్ ఆఫ్ ఇండియాగా చేస్తే.. జగన్ అధికారంలోకి వచ్చాక గంజాయి క్యాపిటల్ గా మార్చారని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ విమర్శించారు. నాలుగున్నరేళ్ల పాలనలో ఒక్క డీఎస్సీ కూడా నిర్వహించకుండా ఎన్నికల ముందు కొత్త నాటకానికి తెరతీశారని మండిపడ్డారు. మోసం, దగా, కుట్రలకు ప్యాంటూ షర్టు తొడిగితే జగన్ లా ఉంటుందంటూ తీవ్ర విమర్శలు చేశారు. ఈమేరకు శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురంలో ‘శంఖారావం’ యాత్రను లోకేశ్ ఆదివారం ప్రారంభించారు.

అనంతరం స్థానికంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో లోకేశ్ మాట్లాడుతూ.. ఉత్తరాంధ్ర అమ్మలాంటిదని, అమ్మప్రేమకు ఎలా కండిషన్స్‌ ఉండవో.. ఇక్కడి ప్రజలు కూడా అంతేనని చెప్పారు. పౌరుషాలు, పోరాటాలకు మారుపేరు శ్రీకాకుళం జిల్లా అని అన్నారు. గరిమెళ్ల సత్యనారాయణ, గౌతు లచ్చన్న, ఎర్రన్నాయుడు పుట్టిన గడ్డ ఇది.. ఇలాంటి ప్రాంతంలో ‘శంఖారావం’ యాత్ర ప్రారంభిస్తుండటం అదృష్టంగా భావిస్తున్నట్లు లోకేశ్ పేర్కొన్నారు.

వచ్చే ఎన్నికల్లో గెలిచి టీడీపీ రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని నారా లోకేశ్ ధీమా వ్యక్తం చేశారు. టీడీపీ ప్రభుత్వం వచ్చాక ఏటా డీఎస్సీ నిర్వహిస్తామని హామీ ఇచ్చారు. ముఖ్యమంత్రి జగన్ నిరుద్యోగుల జీవితాలతో చెలగాటమాడుతున్నారని, 2019 అసెంబ్లీ ఎన్నికల ముందు 23 వేల పోస్టులతో డీఎస్సీ నిర్వహిస్తామని హామీ ఇచ్చారని గుర్తుచేశారు. అధికారంలోకి వచ్చాక 23 వేల పోస్టులు కాస్తా 18 వేల పోస్టులయ్యాయని, ఆపై స్కూలు రేషనలైజేషన్ పేరుతో మరిన్ని పోస్టులు తగ్గించారని చెప్పారు. నాలుగున్నరేళ్లపాటు డీఎస్సీ ఊసే ఎత్తకుండా ప్రస్తుతం ఎన్నికల ముందు డీఎస్సీ ప్రకటన విడుదల చేశారని విమర్శించారు. అదికూడా కేవలం 6 వేల పోస్టులతో నోటిఫికేషన్ విడుదల చేశారని నారా లోకేశ్ మండిపడ్డారు.

జగన్ సిద్ధం సభపై లోకేశ్ విసుర్లు..
జగన్ సభను చూస్తే తనకు నవ్వొచ్చిందని నారా లోకేశ్ శంఖారావం సభలో చెప్పారు. ‘సిద్ధం.. సిద్ధం.. సిద్ధం.. అంటున్నారు దేనికయ్యా మీరు సిద్ధం? జైలుకు పోవడానికి సిద్ధమా..’ అని అడిగారు. జగన్ ను జైలుకు పంపించేందుకు మీరు సిద్ధమా అని సభకు వచ్చిన ప్రజలను లోకేశ్ అడిగారు. సొంత బాబాయినే లేపేశాడు.. ఇంకా ఎంతమంది కుటుంబ సభ్యులను లేపేయడానికి సిద్ధమని జనం అడుగుతున్నారని లోకేశ్ విమర్శించారు.


More Telugu News