గాజాలోని ఐరాస ఏజెన్సీ కార్యాలయం కింద హమాస్ సొరంగం!

  • గుర్తించినట్టు ప్రకటించిన ఇజ్రాయెల్ సైన్యం
  • గాజా నగరంలో ఆపరేషన్స్ చేపడుతుండగా గుర్తించామని ప్రకటన
  • అక్టోబర్ 12నే అక్కడ కార్యకలాపాలు నిలిపివేశామన్న ఐరాస ఏజెన్సీ యూఎన్‌ఆర్‌డబ్ల్యూఏ
పాలస్తీనా శరణార్థుల కోసం ఐక్యరాజ్యసమితి ఏజెన్సీ యూఎన్‌ఆర్‌డబ్ల్యూఏ (United Nations Relief and Works Agency) గాజా సిటీలో ఏర్పాటు చేసిన ప్రధాన కార్యాలయం కింద హమాస్ సొరంగాన్ని గుర్తించినట్టు ఇజ్రాయెల్ సైన్యం శనివారం ప్రకటించింది. ఇజ్రాయెల్ సైన్యం, ఆ దేశ భద్రత ఏజెన్సీ ‘షిన్ బెట్’ ఇటీవల గాజా నగరంలో ఆపరేషన్స్ చేపడుతుండగా ఈ సొరంగం వెలుగుచూసినట్టు తెలిపింది. ఇది ఐరాస ఏజెన్సీ ఆఫీస్ భవనం కిందకు వెళ్తోందని తెలిపింది. యూఎన్‌ఆర్‌డబ్ల్యూఏ నిర్వహించే పాఠశాల సమీపంలో సొరంగాన్ని కనుగొన్నామని ఇజ్రాయెల్ సైన్యం తెలిపింది. 

ఈ సొరంగం హమాస్ మిలిటరీ ఇంటెలిజెన్స్ విభాగానికి కీలకమైన స్థావరంగా ఉందని, గాజా స్ట్రిప్‌లోని ఐరాస ఏజెన్సీ ప్రధాన కార్యాలయ భవనం కిందకి ఈ సొరంగం వెళ్లిందని ప్రకటనలో పేర్కొంది. ఈ సొరంగంలో విద్యుత్ సదుపాయం ఉందని, ఇది 700 మీటర్లు పొడవు, 18 మీటర్ల వెడల్పు ఉందని తెలిపింది. యూఎన్‌ఆర్‌డబ్ల్యూఏ వసతుల ద్వారా టన్నెల్‌కు విద్యుత్తును సరఫరా చేశారని అర్థమవుతోందని ఇజ్రాయెల్ ఆర్మీ పేర్కొంది. కాగా తమ కార్యకలాపాలపై అనుమానం రాకుండా, రక్షణ కవచంగా స్కూల్స్, హాస్పిటల్స్, జన సముదాయం అధికంగా ఉండే ఇతర సదుపాయాల కింద సొరంగాల నెట్‌వర్క్‌ను ఏర్పాటు చేసుకున్నారని గతంలోనే ఇజ్రాయెల్ ఆరోపించగా హమాస్ ఖండించిన విషయం తెలిసిందే. 

ఇజ్రాయెల్ ప్రకటనపై యూఎన్‌ఆర్‌డబ్ల్యూఏ స్పందించింది. దక్షిణ ఇజ్రాయెల్‌లో హమాస్ ఉగ్రవాదులు అక్టోబర్ 7నుంచి భీకర దాడులు జరిపిన 5 రోజుల తర్వాత తమ కార్యకలాపాలను నిలిపివేశామని యూఎన్‌ఆర్‌డబ్ల్యూఏ తెలిపింది. సొరంగం ఆరోపణలపై స్వతంత్ర దర్యాప్తుకు జరుగుతోందని వెల్లడించింది. మరోవైపు ఇజ్రాయెల్ ఆరోపణల నేపథ్యంలో గత నెలలో పలువురు సిబ్బందిని ఏజెన్సీ తొలగించిన విషయం తెలిసిందే.


More Telugu News