మురళీమోహన్ లాంటి కొందరికే అది సాధ్యం.. ఎంఎంఎం 50 ఏళ్ల సినీ ప్రస్థాన కార్యక్రమంలో చంద్రబాబు

  • 50 ఏళ్ల సినీ ప్రస్థానం మురళీమోహన్‌కే సాధ్యమన్న చంద్రబాబు
  • టీడీపీ ఆవిర్భావం తర్వాత ప్రతి ఎన్నికల్లోనూ మురళీమోహన్ ప్రచారం చేశారని గుర్తు చేసిన బాబు
  • తెలుగుజాతి బతికున్నంత వరకు ఎన్టీఆర్ పేరు వినిపిస్తుందన్న టీడీపీ అధినేత
  • అప్పట్లో వెంకయ్యనాయుడిని చూస్తే అసెంబ్లీ గడగడలాడేదన్న చంద్రబాబు
  • పీవీకి భారతరత్నపురస్కారం రావడం సంతోషకరమన్న బాబు
  • పేదరికం లేని తెలుగుజాతిని చూడాలన్నదే తన కల అని చెప్పిన చంద్రబాబు
50 ఏళ్ల సినీ ప్రస్థానం మురళీమోహన్ ఘనత అని, అది కొందరి వ్యక్తులకే సాధ్యమవుతుందని టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు అన్నారు. సినీ, వ్యాపార, రాజకీయ రంగాల్లో మురళీమోహన్ సక్సెస్ అయ్యారని ప్రశంసించారు. ఎంఎంఎం (మాగంటి మురళీమోహన్) 50 ఏళ్ల సినీప్రస్థానం కార్యక్రమంలో భాగంగా గత రాత్రి హైదరాబాద్ లోని శిల్పకళావేదికలో ఏర్పాటు చేసిన అభినందన కార్యక్రమంలో చంద్రబాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మురళీమోహన్ 50 ఏళ్ల సినీ, రాజకీయ, వ్యాపార విజయాలను వివరిస్తూ రూపొందించిన ‘తెలుగునేల గౌరవం...తెలుగు సినీ గాండీవం’అనే పాటను ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ చాలా రోజుల తర్వాత శిల్పకళావేదికకు రావడంతో పాత రోజులు గుర్తుకొస్తున్నాయని అన్నారు. ఒక్కొక్కరు ఒక్కో రంగానికే పరిమితం అవుతారని, సినీ రంగంలో ఎన్టీఆర్‌కు ఎవరూ సాటి లేరని, మళ్లీ ఆయన పుట్టి వస్తే తప్ప ఆయన పోషించిన పాత్రలు వేయడం సాధ్యం కాదని పేర్కొన్నారు. దేశ రాజకీయాలకు సరికొత్త నిర్వచనం చెప్పిన వ్యక్తి ఎన్టీఆర్ అని ప్రశంసించారు. తెలుగు జాతి బతికున్నంత కాలం ఎన్టీఆర్ పేరు వినిపిస్తూనే ఉంటుందన్నారు.
    350 సినిమాల్లో నటించిన మురళీమోహన్ తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి ప్రతి ఎన్నికల్లోనూ ప్రచారం చేశారని గుర్తు చేశారు. రాజమండ్రి ఎంపీగా గెలిచి ప్రజలకు సేవ చేశారని కొనియాడారు.. తాను హైటెక్ సిటీ నిర్మిస్తే పక్కనే జయభేరి ఎస్టేట్స్ పేరుతో బ్రహ్మాండంగా నిర్మాణాలు చేశారని గుర్తు చేశారు. 1100 మంది పేద విద్యార్థులను డాక్టర్లు, ఇంజినీర్లుగా చేసి వారి జీవితాలను మార్చారని ప్రశంసించారు. 

 1978లో తాను, వెంకయ్యనాయుడు ఒకేసారి రాజకీయాల్లోకి వచ్చామని, అప్పట్లో ఆయనను చూస్తే అసెంబ్లీ గడగడలాడేదని తెలిపారు. 1984లో ఎన్టీఆర్‌ను సీఎంగా తొలగిస్తే వెంకయ్యనాయుడు బీజేపీలో ఉన్నా ఎన్టీఆర్‌కు అండగా ఉండి సీఎం అయ్యేదాకా నిలబడ్డారని గుర్తు చేశారు. పదవులకు వన్నె తెచ్చిన వెంకయ్య నాయుడికి పద్మవిభూషణ్ పురస్కారం రావడం తెలుగుజాతికే గర్వకారణమని అన్నారు. దేశంలో మెరుగైన ఆర్థికవ్యవస్థకు కృషి చేసిన పీవీ నరసింహారావుకు దేశ అత్యున్నత పురస్కారం భారతరత్న రావడం సంతోషమన్నారు. పేదరికం లేని తెలుగుజాతిని చూడాలన్నదే తన ఆశయమని చంద్రబాబు పేర్కొన్నారు. పేదరిక నిర్మూలన కోసం ప్రతి ఒక్కరు కష్టపడాలని చంద్రబాబు పిలుపునిచ్చారు. 
  


More Telugu News