బాలీవుడ్ నటుడు మిథున్ చక్రవర్తికి బ్రెయిన్ స్ట్రోక్‌.. నిలకడగా ఆరోగ్యం

  • శనివారం కోల్‌కతాలో షూటింగ్‌లో అనారోగ్యం పాలైన మిథున్ చక్రవర్తి
  • వడివడిగా ఆసుపత్రికి తరలింపు, మిథున్‌కు స్ట్రోక్ వచ్చినట్టు పరీక్షల్లో వెల్లడి
  • ప్రస్తుతం మిథున్ ఆరోగ్యం నిలకడగా ఉందన్న నటుడి కుమార్తె 
ఇషెమిక్ బ్రెయిన్ స్ట్రోక్‌తో ఆసుపత్రి పాలైన ప్రముఖ బాలీవుడ్ నటుడు మిథున్ చక్రవర్తి ఆరోగ్యం ప్రస్తుతం నిలకడగా ఉందని ఆయన కుమార్తె నమిశి చక్రవర్తి వెల్లడించారు. ఐసీయూ నుంచి క్యాబిన్‌కు మార్చారని తెలిపారు. 

మిథున్ చక్రవర్తి ప్రస్తుతం శాస్త్రి అనే సినిమాలో జోతిష్యుడి పాత్రలో నటిస్తున్నారు. కోల్‌కతాలో శనివారం షూటింగ్ సందర్భంగా ఆయన అకస్మాత్తుగా అనారోగ్యం పాలయ్యారని మూవీ డైరెక్టర్ పతికృత్ బసు తెలిపారు. మాటలో తడబాటు, చేయిలో కదలిక తగ్గడంతో వెంటనే ఆయనను ఆసుపత్రికి తరలించామన్నారు. ఎమ్మారై సహా పలు ఇతర పరీక్షలు చేసిన వైద్యులు ఆయనకు మైల్డ్ స్ట్రోక్ వచ్చినట్టు నిర్ధారించారని తెలిపారు. మరోవైపు, మిథున్ చక్రవర్తి ఆసుపత్రి పాలయ్యారన్న వార్త ఆయన అభిమానులను ఆందోళనకు గురిచేసింది. 

ఎమిటీ ఇషెమిక్ స్ట్రోక్?

మెదడు రక్తనాళాల్లో రక్తం గడ్డకట్టి రక్త ప్రవాహానికి అడ్డంకి ఏర్పడితే దాన్ని ఇషెమిక్ స్ర్టోక్ అంటారు. 87 శాతం స్ట్రోక్ కేసులకు ఇదే కారణమని వైద్యులు చెబుతున్నారు. రక్తనాళాల లోపలివైపు గోడలపై కొవ్వు పేరుకుని రక్తనాళం కుంచించుకుపోయినా స్ట్రోక్ వస్తుంది. దీన్ని ఎథిరోస్ల్కెరోసిస్ అంటారు. రక్తసరఫరా నిలిచిపోవడంతో మెదడులోని కణాలు నిమిషాల వ్యవధిలోనే చనిపోతాయి. స్ట్రోక్ బాధితులకు బ్లడ్ యాంటీ కొయాగ్యులెంట్స్‌‌తో చికిత్స చేస్తారు. 

స్ట్రోక్ లక్షణాలు ఇవే
  • కాలు, చేయి లేదా ముఖం మొద్దు బారినట్టు ఉండటం, బలహీనంగా అనిపించడం
  • కన్ఫ్యూజన్, మాట్లాడటంలో ఇబ్బంది, అవతలివారు చెప్పేది అర్థం చేసుకోలేకపోవడం 
  • కంటి చూపు మసకబారడం
  • తలతిరిగినట్టు ఉండటం, నడవలేకపోవడం
  • అకస్మాత్తుగా తీవ్రమైన తలనొప్పి వంటి లక్షణాలు స్ట్రోక్ బాధితుల్లో కనిపిస్తాయని వైద్యులు చెబుుతున్నారు. 



More Telugu News