తప్పు చేశాను.. విరాట్ కోహ్లీ కుటుంబానికి సారీ: క్రికెట్ దిగ్గజం ఏబీ డివిలియర్స్ ప్రకటన

  • కోహ్లీ రెండవసారి తండ్రి కాబోతున్నాడన్న ప్రకటనను విరమించుకున్న దక్షిణాఫ్రికా మాజీ ఆటగాడు
  • విషయం ఏంటో తెలియకుండా మాట్లాడానని వివరణ
  • కోహ్లీ వ్యక్తిగత గోప్యతను ప్రతి ఒక్కరూ గౌరవించాలని విజ్ఞప్తి
టీమిండియా స్టార్ బ్యాట్స్‌మెన్ విరాట్ కోహ్లీ వ్యక్తిగత కారణాలతో భారత్, ఇంగ్లండ్ మధ్య జరుగుతున్న టెస్టు సిరీస్‌లో ఆడడం లేదు. ఇటీవలే మూడవ మ్యాచ్‌కు జట్టు ప్రకటన సందర్భంగా బీసీసీఐ ఇదే విషయాన్ని తెలిపింది. కోహ్లీ వ్యక్తిగత కారణాల వల్ల సిరీస్‌లో మిగిలిన మ్యాచ్‌లకు అందుబాటులో ఉండడంలేదని, అతని నిర్ణయాన్ని గౌరవిస్తున్నట్టు ఒక ప్రకటనలో పేర్కొంది. అయితే విరాట్-అనుష్క దంపతులు రెండవసారి తల్లిదండ్రులు కాబోతున్నారని, విరాట్ అందుబాటులో లేకపోవడానికి ఇదే కారణమంటూ ఇటీవలే వెల్లడించిన దక్షిణాఫ్రికా మాజీ క్రికెటర్ ఏబీ డివిలియర్స్ తన ప్రకటనను ఉపసంహరించుకున్నాడు. 

‘‘ నేను తప్పు చేశాను. విరాట్ కోహ్లీ కుటుంబానికి క్షమాపణలు చెబుతున్నాను. ప్రతి ఒక్కరూ గోప్యతను గౌరవించాలి’’ అని ప్రకటించాడు. ‘‘ తొలుత కుటుంబం. ఆ తర్వాతే క్రికెట్. నేను నా యూట్యూబ్ ఛానెల్‌లో పెద్ద తప్పు చేశాను. ఆ సమాచారం తప్పు. అందులో నిజం లేదు. ఏం జరుగుతుందో ఎవరికీ తెలియదు. నేను శుభాకాంక్షలు మాత్రమే చెప్పగలను. కోహ్లీ విరామానికి కారణం ఏమైనప్పటికీ మరింత దృఢంగా, మెరుగ్గా, నూతనోత్సాహంతో తిరిగి వస్తాడని ఆశిస్తున్నాను’’ అంటూ తన యూట్యూబ్‌ ఛానల్‌లో డివిలియర్స్ పేర్కొన్నాడు. 

తన స్నేహితుడు విరాట్ కోహ్లి ఇప్పటికీ అందుబాటులో లేడని, అతడికి ప్రైవసీ ఇవ్వాలని ప్రతి ఒక్కరినీ కోరుతున్నానని అన్నాడు. కుటుంబమే తొలి ప్రాధాన్యతని, అసలు ఏమి జరుగుతుందో ఎవరికీ తెలియదు, కాబట్టి దానిని గౌరవించాలని విజ్ఞప్తి చేస్తున్నానని అన్నాడు. గత షోలో పొరపాటు జరిగిందని తెలుసుకొని, కోహ్లీ కుటుంబానికి సారీ చెబుతున్నానని డివిలియర్స్ అన్నాడు. ధృవీకరించని సమాచారాన్ని పంచుకున్నానని అన్నాడు. విరాట్ తిరిగి సంతోషంగా ఉండాలని, ఎప్పటిలాగే క్రికెట్‌లో పరుగులు చేయాలని ఆశిస్తున్నానని అన్నాడు. ఈ మేరకు యూట్యూబ్ లైవ్‌లో చెప్పాడు. కాగా విరాట్ కోహ్లీ  - ఏబీ డివిలియర్స్ ఐపీఎల్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకి కలిసి ఆడిన విషయం తెలిసిందే.


More Telugu News