జనసేన సరైన వ్యూహంతోనే ముందుకు పోతోంది: లోక్ సత్తా జయప్రకాశ్ నారాయణ్

  • ఏపీలో టీడీపీతో పొత్తు పెట్టుకున్న జనసేన
  • కొత్త పార్టీలు మూడో స్థానంలోకి వెళితే పతనమేనన్న జేపీ
  • కొత్త పార్టీలకు పొత్తులు అనివార్యమని వెల్లడి
  • జనసేన తీసుకున్న నిర్ణయం సబబేని వ్యాఖ్యలు
  • ఎవరితో పొత్తు అనేది ముఖ్యం కాదు... అజెండా ముఖ్యమని స్పష్టీకరణ
లోక్ సత్తా పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు జయప్రకాశ్ నారాయణ్ జనసేన పార్టీ, పవన్ కల్యాణ్ పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కొత్త పార్టీ అయిన జనసేన సరైన దిశలోనే పయనిస్తోందని అభిప్రాయపడ్డారు. 

రాజకీయాల్లోకి వస్తే ప్రతి ఒక్కరికీ నమస్కారం పెట్టాలని, కొన్నిసార్లు సభలకు ప్రజలను డబ్బులిచ్చి తీసుకురావాల్సి ఉంటుందని అన్నారు. అదే సినిమాల్లో అయితే, ప్రజలే డబ్బులిచ్చి సినిమాలకు వస్తుంటారని వివరించారు. అలాంటి జీవితాన్ని వదులుకుని పవన్ కల్యాణ్ రాజకీయాల్లోకి వచ్చారని, మార్పు తీసుకురావాలన్న తపన అతడిలో ఉందని జయప్రకాశ్ నారాయణ్ తెలిపారు. ఎవరు మంచి ఉద్దేశంతో రాజకీయాల్లోకి వచ్చినా కూడా మనం వారిని గౌరవించాలని పేర్కొన్నారు. 

"మనదేశంలోని ఎన్నికల వ్యవస్థ కొత్తగా వచ్చే పార్టీలకు వ్యతిరేకమైన వ్యవస్థ. ఒక ఓటు ఎక్కువ వస్తే గెలుపు... ఒక ఓటు తక్కువ వస్తే ఓటమి! ఈ విధానాన్ని బ్రిటన్ నుంచి అరువు తెచ్చుకున్నాం... దీన్ని తీసుకోకుండా వదిలేయాల్సింది... కానీ కొనసాగించాం. అందువల్ల మూడో పార్టీకి చాలా కష్టమైన పరిస్థితులు ఎదురవుతున్నాయి. రెండు పార్టీలు బలంగా వేళ్లూనుకున్న చోట మూడో పార్టీకి పతనం అయ్యే పరిస్థితులు తప్పడంలేదు. 

ఏపీలో ఒకప్పుడు కాంగ్రెస్ ఎంతో బలంగా ఉండేది... ఇప్పుడా పార్టీ ఏ స్థానంలో ఉంది? బీజేపీ జాతీయస్థాయిలో బలమైన పార్టీ కదా... ఆంధ్రప్రదేశ్ లో ఏ స్థానంలో ఉంది? తెలంగాణలో కొంతకాలం బీజేపీ పరిస్థితి బాగానే ఉన్నా, మూడో స్థానంలోకి వెళ్లాక ఎన్నికల్లో ఆ పార్టీ పరిస్థితి ఏమైంది? 

అలాంటి ఘన చరిత్ర, డబ్బు, గొప్ప ఇమేజ్, గొప్ప నాయకత్వం ఉన్న పార్టీలే మూడో స్థానంలోకి వెళితే పతనం అవుతుంటే, కొత్తగా వచ్చిన పార్టీ మూడో స్థానంలోకి వెళితే చాలా కష్టం. అలాంటి పార్టీలు నిలదొక్కుకోవాలంటే ఏదో రకంగా పొత్తులు అనివార్యం. పొత్తులు లేకపోతే కొన్ని ఓట్లు వస్తాయి కానీ, రాజకీయంగా ఎలాంటి ప్రభావం ఉండదు. 

ఏ పార్టీతో పొత్తు అనే విషయం వదిలేస్తే ఆ పార్టీ ఏ అజెండాను ప్రతిపాదిస్తుందనేదే ముఖ్యం. ఒంటరిగా గానీ, లేకపోతే కలిసి గానీ... ఏ అజెండాతో వస్తున్నారు? ఆ అజెండా మన రాష్ట్ర ప్రజలకు, దేశ ప్రజలకు ప్రయోజనకరమా? కాదా? ఆచరణ సాధ్యమైనదేనా? చిత్తశుద్ధితో చేస్తున్నారా?... అనే అంశాలు పరిశీలించాలి గానీ... రాజకీయంగా ఎవరితో కలుస్తున్నారనేది ముఖ్యం కాదు. పొత్తు అనేది సందర్భాన్ని బట్టి, అవసరాన్ని బట్టి, అవకాశాన్ని బట్టి ఉంటుంది" అని జయప్రకాశ్ నారాయణ్ వివరించారు.


More Telugu News