పాక్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ కు 12 కేసుల్లో బెయిల్... కానీ!
- మే 9న పాక్ సైనిక స్థావరాలపై దాడులు
- ఇమ్రాన్ ఖాన్ పై డజను కేసులు
- 12 కేసుల్లో బెయిల్ మంజూరు చేసిన ఉగ్రవాద వ్యతిరేక న్యాయస్థానం
- ఇతర కేసుల్లో శిక్ష పడడంతో జైల్లోనే ఇమ్రాన్ ఖాన్
ఏదైనా కేసులో బెయిల్ లభిస్తే ఎవరైనా ఊరట పొందినట్టుగా భావిస్తారు. పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ 12 కేసుల్లో బెయిల్ పొందినప్పటికీ, ఆయనకు ఆనందం మిగల్లేదు. ఉగ్రవాద వ్యతిరేక కోర్టు ఇమ్రాన్ ఖాన్, మాజీ మంత్రి షా మహ్మద్ ఖురేషీలకు బెయిల్ ఇచ్చింది. ఈ 12 కేసులు మే 9న సైనిక స్థావరాలపై జరిగిన దాడులకు సంబంధించినవే. ఈ కేసుల్లో ఇమ్రాన్ ఖాన్ కు బెయిల్ లభించినందున ఆయనను ఇంకా జైల్లో ఉంచడంలో అర్థం లేదని న్యాయమూర్తి వ్యాఖ్యానించారు. అయితే, ఇమ్రాన్ ఖాన్ కు మే 9వ తేదీ ఘటన తాలూకు కేసుల్లో బెయిల్ లభించినప్పటికీ, ఆయన జైలు నుంచి బయటికి వచ్చే పరిస్థితి లేదు. ఆయనకు ఇతర కేసుల్లో జైలు శిక్ష పడిన సంగతి తెలిసిందే.