రేవంత్ రెడ్డి 'అగ్గిపెట్టె' వ్యాఖ్యలకు హరీశ్ రావు కౌంటర్

  • రేవంత్ ఏదైనా మాట్లాడితే అగ్గిపెట్టె ముచ్చట తీసుకువస్తారని... అది సరికాదన్న హరీశ్ రావు
  • అరిగిపోయిన గ్రామ్ ఫోన్ రికార్డులా ప్రతిసారి అగ్గిపెట్టె విషయం తీస్తారన్న బీఆర్ఎస్ నేత
  • ఎస్ఎల్‌బీసీ విషయంలో సభను రేవంత్ రెడ్డి తప్పుదోవ పట్టించారని ఆరోపణ
పెట్రోల్ దొరుకుతుంది కానీ అగ్గిపెట్టె దొరకదంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తనపై చేసిన వ్యాఖ్యల మీద మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు తీవ్రంగా స్పందించారు. రేవంత్ ఏదైనా మాట్లాడితే అగ్గిపెట్టె ముచ్చట తీసుకువస్తారని, అది సరికాదని హితవు పలికారు. నాడు అమరవీరులకు కాంగ్రెస్ నాయకులు శ్రద్ధాంజలి ఘటించలేదు, అమరవీరుల కుటుంబాలను పరామర్శించలేదు, అమరుల పాడెమోసినవాళ్లు కూడా కాదన్నారు.

పైగా తుపాకులతో ఉద్యమకారులను బెదిరించారని ఆరోపించారు. అలాంటి వారికి తెలంగాణ పోరాటం, అమరవీరుల గురించి తెలుస్తుందని తాను అయితే అనుకోవడం లేదన్నారు. అరిగిపోయిన గ్రామ్ ఫోన్ రికార్డులా ప్రతిసారి అగ్గిపెట్టె విషయం తీస్తారని విమర్శించారు. త‌మ‌ను కించ‌ప‌రిచి, రాజ‌కీయంగా విమ‌ర్శిస్తామనుకుంటే అది మీ రాజ‌కీయ విజ్ఞ‌త‌కే వ‌దిలేస్తున్నానని అన్నారు.

ఎస్ఎల్‌బీసీ విషయంలో సీఎం రేవంత్ రెడ్డి సభను తప్పుదోవ పట్టించారని ఆరోపించారు. పదేళ్లలో కిలోమీట‌ర్ త‌వ్వారని ఇటీవల ప్రెస్‌మీట్‌లో రేవంత్ చెప్పారని... కానీ తమ హయాంలో 11 కిలోమీట‌ర్లు త‌వ్విన‌ట్లు తెలిపారు. సీఎం రేవంత్ దీనిని సరి చేసుకోవాలని సూచించారు. మాట్లాడేటప్పుడు అవగాహన ఉండాలని హితవు పలికారు. నాగార్జున సాగర్ విషయంలోను సీఎం సభను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేశారన్నారు.

శ్రీశైలం ఆంధ్రప్రదేశ్ ప్ర‌భుత్వం కంట్రోల్‌లో, నాగార్జున సాగ‌ర్ తెలంగాణ ప్ర‌భుత్వం కంట్రోల్‌లో ఉంటాయని ... కానీ అసెంబ్లీ ఎన్నిక‌ల స‌మ‌యంలో సాగ‌ర్‌ను ఏపీ కంట్రోల్‌లోకి తీసుకుందన్నారు. రెండు నెల‌లు గ‌డుస్తున్న‌ా ఇంకా సాగర్ సీఆర్పీఎఫ్ భద్రతలో ఉందన్నారు. సాగ‌ర్‌ను తెలంగాణ అధీనంలోకి తీసుకునేందుకు కృషి చేయాలని... ఇందుకు తమ సహకారం తప్పకుండా ఉంటుందని హరీశ్ రావు స్పష్టం చేశారు.


More Telugu News