రేపు మధ్యాహ్నం బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్న తెలంగాణ రాష్ట్ర మంత్రి మల్లు భట్టి విక్రమార్క

  • రేపు ఉదయం 9 గంటలకు బడ్జెట్‌కు ఆమోదం తెలపనున్న తెలంగాణ కేబినెట్
  • మధ్యాహ్నం 12 గంటలకు ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్న ఆర్థికమంత్రి
  • ఓట్ ఆన్ అకౌంట్‌లో ఎలాంటి ప్రతిపాదనలు ఉండవు... ఖర్చులు మాత్రమే ఉంటాయి
తెలంగాణ ప్రభుత్వం రేపు బడ్జెట్‌ను ప్రవేశపెట్టనుంది. రేపు మధ్యాహ్నం 12 గంటలకు శాసన సభలో ఉపముఖ్యమంత్రి, ఆర్థికమంత్రి మల్లు భట్టి విక్రమార్క ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. శాసన మండలిలో ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు బడ్జెట్‌ను ప్రవేశపెడతారు. రేపు బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నట్లు స్పీకర్ ప్రసాద్ కుమార్ ప్రకటించారు.

గ‌వ‌ర్న‌ర్ ప్ర‌సంగానికి ధ‌న్య‌వాదాలు తెలిపే తీర్మానానికి శాస‌న‌స‌భ ఆమోదం తెలిపింది. అనంత‌రం స‌భ‌ను వాయిదా వేస్తున్న‌ట్లు స్పీక‌ర్ ప్ర‌క‌టించారు. శ‌నివారం మ‌ధ్యాహ్నం 12 గంట‌ల‌కు స‌భ తిరిగి ప్రారంభ‌మ‌వుతుంద‌ని తెలిపారు. రేపు ఉద‌యం 9 గంట‌ల‌కు తెలంగాణ మంత్రివర్గం స‌మావేశ‌మై బ‌డ్జెట్‌కు ఆమోదం తెలపనుంది.

ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్‌లో ఎలాంటి ప్రతిపాదనలు ఉండవు. కేవలం ఖర్చులు మాత్రమే ఉంటాయి. ప్రభుత్వ కార్యకలాపాలు, శాఖల నిర్వహణ, ఉద్యోగుల వేతనాలు, పెన్షన్ పంపిణీ సాఫీగా సాగేందుకు ఓట్ ఆన్ బడ్జెట్‌ను ప్రవేశపెడతారు.


More Telugu News