తెలంగాణలో గ్రూప్‌-1 అభ్యర్థులకు వయోపరిమితి 46 ఏళ్లకు పెంచుతాం: సీఎం రేవంత్ రెడ్డి

  • త్వరలోనే గ్రూప్-1 పరీక్ష నిర్వహిస్తామని ప్రకటన
  • పోలీసు శాఖ, యూనివర్సిటీలలోని ఖాళీలను త్వరలోనే భర్తీ చేస్తామని వెల్లడి
  • కొన్ని నిబంధనల కారణంగా టీఎస్‌పీఎస్‌సీ ప్రక్షాళన ఆలస్యమైందని వివరణ
తెలంగాణలో గ్రూప్-1 పరీక్ష నిర్వహణపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలకమైన ప్రకటన చేశారు. త్వరలోనే గ్రూప్‌-1 పరీక్ష నిర్వహిస్తామని అసెంబ్లీలో ప్రకటించారు. గ్రూప్-1 అభ్యర్థుల వయోపరిమితిని 46 ఏళ్లకు పెంచుతామంటూ అభ్యర్థులకు గుడ్‌న్యూస్ చెప్పారు. కొన్ని నిబంధనల కారణంగా టీఎస్‌పీఎస్‌సీ ప్రక్షాళన ఆలస్యమైందని ఈ సందర్భంగా సీఎం చెప్పారు.

ప్రభుత్వ ఉద్యోగాలను నియమించాలంటే నిర్దిష్ట విధానం ఉంటుందని సీఎం రేవంత్ తెలిపారు. త్వరలోనే పోలీసు శాఖలో 15 వేల ఉద్యోగాలను భర్తీ చేస్తామని, పోలీసు ఉద్యోగాల కోసం యువత చాలాకాలం ఎదురుచూశారని అన్నారు. యూనివర్సిటీలలోని ఖాళీలను కూడా త్వరలోనే భర్తీ చేస్తామని చెప్పారు. నలుగురి ఉద్యోగాలు ఊడిపోయిన దుఃఖంలో ఉన్న విపక్ష నేతలు 2 లక్షల ఉద్యోగాల గురించి మాట్లాడుతున్నారని బీఆర్ఎస్‌పై వ్యంగ్యాస్త్రాలు సంధించారు. తమ ప్రభుత్వం జిరాక్స్‌ సెంటర్లలో ప్రశ్నపత్రాలు విక్రయించబోదని, ప్రభుత్వ శాఖల్లో బంధువులను పెట్టుకొని ఉద్యోగాలు అమ్ముకోబోదని ఈ సందర్భంగా రేవంత్ సెటైర్లు వేశారు. 


More Telugu News