రోజా గారు పెట్టిన రాగి సంకటి, రొయ్యల పులుసు తిని కేసీఆర్ మౌనంగా ఉండిపోయారు: రేవంత్ రెడ్డి

  • ప్రాజెక్టులపై చిత్తశుద్ధి ఉంటే పాలమూరు రంగారెడ్డి, ఎస్ఎల్‌బీసీ ఎందుకు పూర్తి చేయలేదని ప్రశ్న
  • తెలంగాణ హక్కుల కోసం కొట్లాడుతుంటే మా కాళ్లకు కట్టె పెడుతున్నారని ఆరోపణ
  • కోమటిరెడ్డి వెంకటరెడ్డి మంత్రి పదవిని త్యాగం చేశారని రేవంత్ రెడ్డి ప్రశంస
నేటి ఏపీ మంత్రి రోజా గారు ఆ రోజు పెట్టిన రాగి సంకటి, రొయ్యల పులుసు తిని... రాయలసీమను రతనాల సీమగా చేస్తానని మాట ఇచ్చిన కేసీఆర్... ఇప్పుడు కృష్ణా నీటి ప్రాజెక్టులపై మౌనంగా ఉండిపోయారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విమర్శించారు. గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ సందర్భంగా మాట్లాడారు. ఈ సమయంలో నీటి ప్రాజెక్టులపై మాట్లాడారు. అసెంబ్లీ ఎన్నికలకు ముందు నాగార్జున సాగర్ డ్యాం వద్దకు ఏపీ ముఖ్యమంత్రి పోలీసులను పంపించారన్నారు. కేసీఆర్ అండ లేకుండా ఎలా పంపిస్తారని నిలదీశారు. ఈ సందర్భంగా వారు పెట్టిన పులుసు తిని... వీరు ఇచ్చిన అలుసు వల్లే ఇలా జరిగిందన్నారు.

అప్పుడు రాయలసీమకు వెళ్లినప్పుడు రోజా గారు పెట్టిన రాగి సంకటి, రొయ్యల పులుసు తిని కేసీఆర్ ఇప్పుడు మౌనంగా ఉన్నారన్నారు. ప్రాజెక్టులపై చిత్తశుద్ధి ఉంటే పాలమూరు రంగారెడ్డి, ఎస్ఎల్‌బీసీ ఎందుకు పూర్తి చేయలేదని ప్రశ్నించారు. కృష్ణా జలాల మీద మరణ శాసనం రాశారన్నారు. కృష్ణా జలాలను కేఆర్ఎంబీకి అప్పగించింది గత బీఆర్ఎస్ ప్రభుత్వమే అన్నారు. తెలంగాణ హక్కుల కోసం తాము కొట్లాడుతుంటే తమ కాళ్లకు కట్టె పెడుతున్నారని ఆరోపించారు. 

కోమటిరెడ్డిది త్యాగం

బీఆర్ఎస్ నేతలు తామేదో త్యాగం చేసినట్లుగా చెబుతారని... కానీ త్యాగం అంటే కోమటిరెడ్డి వెంకటరెడ్డిది అన్నారు. ఉద్యమం సమయంలో మంత్రి పదవికి రాజీనామా చేసి తెలంగాణ వచ్చే దాకా ఆ పదవిని తీసుకోనని చెప్పి కట్టుబడి ఉన్నారన్నారు. కానీ బీఆర్ఎస్ నేతలు కలెక్షన్లు, సెలక్షన్లు, ఎలక్షన్లతో ముందుకు సాగారని ఆరోపించారు. రైతు బిడ్డ ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నారన్నారు. సీఎం పీఠంపై రైతుబిడ్డ కూర్చోవడం కొంతమందికి ఇష్టం లేదేమో అన్నారు.


More Telugu News