తన పార్టీ ఎమ్మెల్యేలు నన్ను కలిస్తే కేసీఆర్ అనుమానిస్తున్నారు: రేవంత్ రెడ్డి

  • నియోజకవర్గ పనుల కోసం కలిసేందుకు వస్తే ఎందుకు కంగారుపడుతున్నారు? అన్న సీఎం  
  • త్వరలో గ్రూప్ వన్ నోటిఫికేషన్ ఇస్తామని ప్రకటన
  • కలెక్షన్లు, సెలక్షన్లు, ఎలక్షన్లు బీఆర్ఎస్ తీరు అని విమర్శ
  • అమరులవడమో... హక్కులు సాధించడమో.. ఢిల్లీలో ధర్నా చేయాలని సూచన
సొంత పార్టీ ఎమ్మెల్యేలను కూడా కేసీఆర్ నమ్మరా? మీ పార్టీ ఎమ్మెల్యేలను ఎందుకు నమ్మడం లేదు... మీ ఎమ్మెల్యేలు నియోజకవర్గంలో పనుల కోసం నన్ను కలిస్తే ఎందుకు కంగారుపడుతున్నారు? అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌ను ప్రశ్నించారు. గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ సందర్భంగా ఆయన మాట్లాడారు. కొంతమంది ఎమ్మెల్యేలు నియోజకవర్గాల సమస్యలను తన దృష్టికి తీసుకు రావడానికి కలుస్తున్నారని... కానీ వారిని బీఆర్ఎస్ అగ్రనాయకులు అనుమానిస్తున్నారని... అవమానిస్తున్నారని మండిపడ్డారు. వారి వారి నియోజకవర్గాల కోసం ఎవరికి ఎలాంటి అవసరం వచ్చినా ఎమ్మెల్యేలు తనను కలవవచ్చునని చెప్పారు. సొంత పార్టీ ఎమ్మెల్యేలను కూడా అవమానించడం సరికాదన్నారు. సమస్యలు చెప్పుకోవడానికి ఎవరు వచ్చినా తాను కలుస్తానన్నారు.

త్వరలో గ్రూప్ 1 నోటిఫికేషన్ ఇస్తామని ముఖ్యమంత్రి ప్రకటించారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం నిరుద్యోగుల జీవితాలతో ఆడుకుందని ఆరోపించారు. మైనార్టీలకు ఇచ్చిన హామీలను చిత్తశుద్ధితో అమలు చేస్తామన్నారు. మైనార్టీల హక్కులను తమ ప్రభుత్వం కాపాడుతుందన్నారు. ప్రజావాణి కార్యక్రమం గురించి బీఆర్ఎస్ నేతలు ప్రశ్నిస్తున్నారని... కానీ ఆ కార్యక్రమం కొనసాగుతోందన్నారు. ప్రజావాణి కోసం ఓ ఐఏఎస్ అధికారిని నియమించినట్లు చెప్పారు. ధరణి, హౌసింగ్ సమస్యలపై ఎక్కువగా ఫిర్యాదులు వస్తున్నాయన్నారు. ఈ పాపం ఎవరిది? అని ప్రశ్నించారు.

ప్రజాభవన్‌కు పూలే పేరు పెట్టామని... దానిని ప్రతిపక్షం అభినందిస్తుందనుకుంటే అలా చేయలేదన్నారు. ప్రగతి భవన్‌ను ఆగమేఘాల మీదపూర్తి చేసిన బీఆర్ఎస్ ప్రభుత్వం.. కాళోజీ క్షేత్రాన్ని ఎందుకు పూర్తి చేయలేదు? అని ప్రశ్నించారు. తమ ప్రభుత్వం అధికారంలోకి రాగానే జయశంకర్ గారి ఊరును రెవెన్యూ డివిజన్‌గా మార్చామన్నారు. 97వేల కోట్ల ఖర్చుతో కట్టిన కాళేశ్వరం ప్రాజెక్టుతో కనీసం 90వేల ఎకరాలకు నీరు ఇచ్చారా? అని ప్రశ్నించారు.

కలెక్షన్లు, సెలక్షన్లు, ఎలక్షన్లు బీఆర్ఎస్ తీరు అని విమర్శ

కాంగ్రెస్ పార్టీని పదేపదే వారసత్వ పార్టీ అని బీఆర్ఎస్ నేతలు విమర్శిస్తున్నారని... కానీ గాంధీ కుటుంబం దేశం కోసం ప్రాణత్యాగాలు చేసిందన్నారు. కేసీఆర్ కుటుంబం తెలంగాణ కోసం చేసిన త్యాగం ఏమిటో చెప్పాలన్నారు. సోనియా గాంధీ ప్రధాని పదవిని వదులుకున్నారన్నారు. ఉద్యమం సమయంలో రాజీనామా చేసి మళ్లీ మూడు నెలలకు పదవులు స్వీకరించడమే వారు చేసిన పని అన్నారు. వీటిని త్యాగాలుగా చెప్పుకోవద్దని హితవు పలికారు. కలెక్షన్లు, ఎలక్షన్లు, సెలక్షన్లు బీఆర్ఎస్ తీరు అని ఆరోపించారు.

అమరులవడమో... హక్కులు సాధించడమో.. ఢిల్లీలో ధర్నా చేయాలి

కృష్ణా ప్రాజెక్టులను కేఆర్ఎంబీకి అప్పగించడంపై రేవంత్ రెడ్డి స్పందించారు. కేఆర్ఎంబీకి అప్పగించడంపై పోరాడాలంటే ప్రధాని మోదీతో కొట్లాడాలన్నారు. మరి మోదీ నల్గొండలో ఉంటారా? అక్కడ బీఆర్ఎస్ సభ ఎందుకు? అని ప్రశ్నించారు. కృష్ణా జలాలపై పోరాడాలంటే అమరులవడమో... హక్కులు సాధించడమో బీఆర్ఎస్ నేతలు చేయాలని... అందుకు ఢిల్లీలో ధర్నా చేయాలని సూచించారు. కేంద్రం ప్రాజెక్టులు తీసుకుంటే ధర్నా చేయాల్సింది ఢిల్లీలోనా? నల్గొండలోనా? అని నిలదీశారు. దమ్ముంటే ప్రాజెక్టుల కోసం నల్గొండలో కాకుండా ఢిల్లీలో దీక్ష చేయాలన్నారు.

ఇటీవల అసెంబ్లీ ఎన్నికలకు ముందు పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి ఏకే 47తో పోలీసులను నాగార్జున సాగర్ వద్దకు పంపించారని... అది మన భూభాగమని... కేసీఆర్ అనుమతి లేకుండా జగన్ అక్కడకు పోలీసులను ఎలా పంపిస్తారని నిలదీశారు. మన ప్రాంతంలోకి వచ్చి తుపాకులు పెట్టి ఆక్రమించుకుంటుంటే ఇంటి దొంగలు లేకుండా నాగార్జున సాగర్ మీద ఏపీ పోలీసులు పహారా కాసే అవకాశం ఉంటుందా? అని ప్రశ్నించారు. 


More Telugu News