జగన్ రెడ్డి ఆరు విధ్వంసకర ఆర్ధిక విధానాలతో రాష్ట్రం సర్వనాశనం: యనమల

  • జగన్ రెడ్డి పాలనలో బడ్జెట్ కేటాయింపులకు విలువ లేదన్న యనమల
  • అసెంబ్లీకి చెప్పకుండా తెచ్చిన రూ.5 లక్షల కోట్ల రుణాలు ఏం చేశారని ప్రశ్న
  • తాత్కాలిక అప్పులు రూ.1,18,039 కోట్లు ఏమయ్యాయని నిలదీత
బ్యాడ్ డెట్ (చెడు రుణాలు), హై కరెప్షన్ (తీవ్ర అవినీతి), హై ఇన్‌ప్లేషన్ (అధిక ద్రవ్యోల్బణం), హై అన్ ఎంప్లాయ్‌మెంట్ (తీవ్ర నిరుద్యోగం), హై డెఫిసిట్స్ (తీవ్ర ద్రవ్యలోటు), సిస్టమ్స్ కొలాప్స్ (వ్యవస్థల నిర్వీర్యం) అనే ఆరు విధ్వంసకర ఆర్ధిక విధానాలతో జగన్ రెడ్డి రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారు అంటూ టీడీపీ సీనియర్ నేత, మాజీ ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు ధ్వజమెత్తారు. జగన్ రెడ్డి దోపిడీలో భాగంగా రాష్ట్రంలోని సహజవనరులను ఇష్టానుసారం దోచుకున్నారని మండిపడ్డారు. జగన్ రెడ్డి ఐదేళ్లలో రూ.6 లక్షల కోట్లు దోచుకున్నారని యనమల ఆరోపించారు. 

అసెంబ్లీకి చెప్పేదొకటి చేసేదొకటి

2-3 శాతం కంటే ఎక్కువ ఉండకూడని ద్రవ్యోల్బణం నేడు రాష్ట్రంలో 8.5 శాతంగా ఉంది. రాష్ట్రంలో పట్టభద్రుల నిరుద్యోగిత 24 శాతం. 2018-19 లో రూ.35,467 గా ఉన్న ద్రవ్యలోటు 2022-23 కి రూ.52,508 కోట్లకు చేరుకుంది. 2018-19లో రూ.13,899గా ఉన్న రెవెన్యూ లోటు 2022-23 నాటికి రూ.43,487 కోట్లకు చేరుకుంది. 

రెవెన్యూ లోటు టీడీపీ హయాంలో మొత్తం రెవెన్యూ రాబడుల్లో 12.12 శాతం ఉంటే, నేడు అది 28 శాతానికి చేరింది. ఇది టీడీపీ హయాంలో కంటే రెండు రెట్లను మించి అధికం. రాష్ట్ర ఆర్ధిక దుస్థితిపై అసెంబ్లీ సాక్షిగా చేదు నిజాలను దాచిపెట్టి రాష్ట్ర ప్రజలను మసిపూసి మారేడు కాయ చేయాలని వైసీపీ ప్రభుత్వం చూస్తోంది. 

జగన్ రెడ్డి పాలనలో అసెంబ్లీ నుంచి అనుమతి పొందిన పద్దులకు విలువ లేకుండా చేశారు. అసెంబ్లీకి చెప్పేదొకటి చేసేది మరొకటిలా ఐదేళ్ల పాలన సాగింది. 2022-23 ఆర్ధిక సంవత్సరానికి శాసనసభకు చెప్పి తెచ్చిన అప్పులను సైతం బుగ్గన దాచిపెట్టారు. 

ఇవికాక ఏడాదికి లక్ష కోట్లకు పైగా బడ్జెటేతర అప్పులు తెచ్చారు. ఈ లెక్కన ఐదేళ్లలో రూ.5 లక్షల కోట్లు కేవలం బడ్జెటేతర అప్పులే ఉన్నాయి. ఆర్ధిక మంత్రి బుగ్గన బడ్జెట్ ప్రసంగం అబద్దాల తేనెతుట్టెలా తియ్యగా పలికారు. 

ఆర్బీఐ నుంచి తెచ్చిన అప్పులతోనే రాష్ట్రాన్ని నడిపిస్తున్నారు

2022-23 ఏడాది రాష్ట్రాన్ని వైసీపీ ప్రభుత్వం ఆర్బీఐ నుంచి తెచ్చిన తాత్కాలిక అప్పులతోనే నడిపింది. ఏడాదిలో 365 రోజుల్లో 24 రోజులు తప్ప మొత్తం ఏడాది చేబదుళ్లతోనే గడిచింది. ఓడీ 152 రోజులు తీసుకున్నారు. ఈ విధంగా ఆర్బీఐ ద్వారా 2022-23 ఆర్ధిక సంవత్సరంలో తీసుకున్న రూ.1,18,039 కోట్లు ఏం చేశారో రాష్ట్ర ప్రజలకు చెప్పాలి. 

జగన్ రెడ్డి పాలన మొదలైన ఏడాది నుంచి చివరి ఏడాది వరకు ఏడాదికి లక్ష కోట్లకు చొప్పున ఐదేళ్లలో రూ.5 లక్షల కోట్ల మేర కార్పొరేషన్ రుణాలు తీసుకున్నారు. ఈ అప్పులను ఎక్కడ ఖర్చు చేశారో కాగ్‌కు సైతం చెప్పలేదు. 

అప్పులు ఇచ్చేటప్పుడు జాగ్రత్త అని బ్యాంకులను ఆర్బీఐ హెచ్చరించింది

జగన్ రెడ్డి ప్రభుత్వ అప్పులపై కేంద్రం, ఆర్బీఐ హెచ్చరించాయి. ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వరంగ సంస్థలకు అప్పులు ఇచ్చేటప్పుడు జాగ్రత్తగా ఉండాలని ఆర్బీఐ బ్యాంకులను హెచ్చరించింది. ఐదేళ్లలో జగన్ రెడ్డి రూ.7.80 లక్షల కోట్లు అప్పులు చేసినా రాష్ట్రంలో అభివృద్ధి శూన్యం. 2022-23 లో తీసుకున్న బడ్జెట్ అప్పులు రూ.67,985 కోట్లు అయితే అందులో నుంచి రాష్ట్రానికి ఆస్తుల కల్పన చేసే మూలధన వ్యయంకు చేసిన ఖర్చు కేవలం రూ.9,017 కోట్లు మాత్రమే. ఇది రాష్ట్ర స్థూల ఉత్పత్తిలో 0.55 శాతం మాత్రమే. 

ఖర్చు చేయకుండా రాష్ట్ర స్థూల ఉత్పత్తి (ఎస్.జి.ఎస్.టి) ఎలా పెరుగుతుంది?

రాష్ట్ర స్థూల ఉత్పత్తి 2021-22 లో 11,22,837 కోట్లు ఉండగా 2022-23 లో 13,17,728 కోట్లకు పెరిగిందని తప్పుడు లెక్కలు ప్రచురించారు. రాష్ట్రంలో పారిశ్రామిక ప్రగతి శూన్యం. 

ఆర్.టి.ఐ ద్వారా వచ్చిన సమాచారం ప్రకారం జగన్ రెడ్డి ఐదేళ్ల పాలనలో రాష్ట్రంలో గ్రౌండ్ అయిన పరిశ్రమలు కేవలం 18. వాటి విలువ కేవలం రూ.5,710 కోట్లు. వాటి ద్వారా కల్పించబడ్డ ఉద్యోగ అవకాశాలు 9,158. టీడీపీ ఐదేళ్ల హయాంలో రాష్ట్రానికి వచ్చిన పరిశ్రమల సంఖ్య 40,969, పెట్టుబడులు రూ.11,17,907 కోట్లు, 13,88,733 మంది ఉపాధి అవకాశాలు పొందారు.

వివిధ రంగాలకు బడ్జెట్ లో కేటాయించిన ప్రకారం ఖర్చు చేయకుండా రాష్ట్ర స్థూల ఉత్పత్తి ఏ విధంగా పెరుగుతుంది? రాష్ట్ర తలసరి ఆదాయం ఎందుకు పెరుగుతుంది? రాష్ట్ర స్థూల ఉత్పత్తిపై వైసీపీ ప్రభుత్వం చెప్పేవన్నీ దొంగ లెక్కలే.

జగన్ రెడ్డి పాలనలో పేదలు మరింత పేదలయ్యారు

బుగ్గన బడ్జెట్ ప్రసంగంలో పేదలు తగ్గారని అబద్దాలు చెప్పారు. సుస్థిరాభివృద్ధి లక్ష్యాల సూచీలో మన రాష్ట్రం స్థానం ఎక్కడో చెప్పకుండా పేదరికం తగ్గిందని చెప్పడం అవివేకం. సుస్థిరాభివృద్ధి లక్ష్యాలలో మన రాష్ట్రానిది 13వ స్థానం. హ్యూమన్ డెవలప్‌మెంట్ ఇండెక్స్‌లో మనది 20వ స్థానం. 

దక్షిణాది రాష్ట్రాలైన కేరళ, తమిళనాడు, కర్ణాటకలు పేదరిక నిర్మూలనలో మనకంటే ఎంతో మెరుగైన స్థానాల్లో ఉన్నాయి. మన కంటే వనరులు తక్కువైన పొరుగు రాష్ట్రం తెలంగాణ ఏపీ కంటే మెరుగ్గా 21వ స్థానంలో నిలిచింది.

పేదల ఆరోగ్యం కోసం ఖర్చు చేయాల్సిన ఆరోగ్యశ్రీకి కూడా జగన్ రెడ్డి రూ.1200 కోట్లు బకాయి పెట్టారు. ఇదేనా పేదరిక నిర్మూలన?... అంటూ యనమల రామకృష్ణుడు ఏపీ ప్రభుత్వాన్ని నిలదీశారు.


More Telugu News