పీవీ అందించిన సేవలు చిరస్మరణీయం: ప్రధాని మోదీ

  • మాజీ ప్రధాని పీవీ నరసింహారావుకు భారతరత్న
  • పీవీకి భారతరత్న హర్షణీయమన్న ప్రధాని మోదీ
  • పీవీ దేశానికి బహుముఖ సేవలు అందించారని కితాబు
  • భారత్ ప్రపంచ మార్కెట్ దృష్టిలో పడింది పీవీ హయాంలోనే అని వెల్లడి
తెలుగుబిడ్డ, మాజీ ప్రధాని పీవీ నరసింహారావుకు కేంద్రం భారతరత్న ప్రకటించిన సంగతి తెలిసిందే. దీనిపై ప్రధాని నరేంద్ర మోదీ స్పందించారు. మాజీ ప్రధాని పీవీకి భారతరత్న హర్షణీయం అని పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా, కేంద్రమంత్రిగా, ప్రధానమంత్రిగా పీవీ అందించిన సేవలు చిరస్మరణీయం అని కొనియాడారు. 

ఓ రాజనీతిజ్ఞుడిగా ఈ దేశానికి పీవీ నరసింహారావు అందించిన సేవలు వెలకట్టలేనివని వివరించారు. భారతదేశం ప్రపంచ మార్కెట్ దృష్టిలో పడింది పీవీ హయాంలోనే అని మోదీ గుర్తు చేశారు. దేశం ఆర్థికాభివృద్ధి దిశగా కొత్త అడుగులు వేసింది కూడా ఆయన పాలనలోనే అని స్పష్టం చేశారు. 

విదేశాంగ నిపుణుడిగా, విద్యా రంగ కోవిదుడిగా పీవీ అందించిన సహకారం భారతదేశాన్ని సాంస్కృతికంగా, మేథో పరంగా సుసంపన్నం చేసిందని కీర్తించారు. 

ఇక, మాజీ ప్రధాని చరణ్ సింగ్, వ్యవసాయ శాస్త్రవేత్త స్వామినాథన్ లకు కూడా భారతరత్న ప్రకటించడం పట్ల  ప్రధాని మోదీ సంతోషం వెలిబుచ్చారు.


More Telugu News