పీవీ నరసింహారావుకు భారతరత్నపై.. కేసీఆర్, కేటీఆర్ స్పందన

  • తెలంగాణ బిడ్డకు భారతరత్న దక్కడం సంతోషకరమన్న కేసీఆర్
  • కేంద్రానికి ధన్యవాదాలు తెలిపిన బీఆర్ఎస్ అధినేత
  • పీవీకి భారతరత్న ఇవ్వాలని తాము ఎప్పటి నుంచో డిమాండ్ చేస్తున్నామన్న కేటీఆర్
మాజీ ప్రధాని, తెలుగు జాతి ముద్దు బిడ్డ పీవీ నరహింహారావుకు భారత ప్రభుత్వం అత్యున్నత పౌర పురస్కారం భారతరత్నను ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సంతోషాన్ని వ్యక్తం చేశారు. తెలంగాణ బిడ్డ, భారత మాజీ ప్రధాని పీవీ నరసింహారావు గారికి దేశ అత్యున్నత పురస్కారం భారతరత్న దక్కడం సంతోషకరమని ఆయన అన్నారు. ఈ పురస్కారం తెలంగాణ ప్రజలకు దక్కిన గౌరవం అని చెప్పారు. పీవీకి భారతరత్న ప్రకటించాలని బీఆర్ఎస్ పార్టీ చేసిన డిమాండ్ ను గౌరవించి... ఆయనకు భారతరత్న ఇవ్వడం పట్ల కేంద్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు. 

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎక్స్ వేదికగా స్పందిస్తూ... మాజీ ప్రధాని పీవీ నరసిహారావును కేంద్ర ప్రభుత్వం భారతరత్నతో గౌరవించడం సంతోషంగా ఉందని చెప్పారు. ఈ నిర్ణయం తీసుకున్న ప్రధాని మోదీకి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నానని అన్నారు. కేసీఆర్ నేతృత్వంలోని తెలంగాణ ప్రభుత్వం పీవీ శతాబ్ది ఉత్సవాలను నిర్వహించినప్పటి నుంచి... ఆయనకు భారతరత్న ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వాన్ని తాము డిమాండ్ చేస్తూనే ఉన్నామని చెప్పారు. 



More Telugu News