మసీదు కూల్చివేతతో హింస.. ఉత్తరాఖండ్‌లో నలుగురి మృతి

  • కోర్టు ఆదేశాలతో హల్ద్వానీలో మదర్సా, మసీదు కూల్చివేసిన అధికారులు
  • స్థానికులు అడ్డుకునే ప్రయత్నం చేయడంతో చెలరేగిన హింస
  • వాహనాలకు నిప్పు పెట్టిన ఆందోళనకారులు
ఉత్తరాఖండ్‌లోని హల్ద్వానీలో అక్రమంగా నడుస్తున్న మదర్సా, దానిని ఆనుకుని ఉన్న మసీదు కూల్చివేత హింసకు దారితీశాయి. ఈ ఘటనలో నలుగురు ప్రాణాలు కోల్పోగా 250 మంది వరకు గాయపడ్డారు. హింస మరింత విస్తరించకుండా కనిపిస్తే కాల్చివేత ఆదేశాలతో పోలీసులు నగరంలో కర్ఫ్యూ విధించారు. ఇంటర్నెట్‌ను పూర్తిగా నిషేధించారు. స్కూళ్లు మూతపడ్డాయి.

కోర్టు ఆదేశాలతో గురువారం పోలీసులతో కలిసి ఆ ప్రాంతానికి చేరుకున్న ప్రభుత్వాధికారులు మదర్సా, మసీదు అక్రమంగా నడుస్తున్నట్టు ప్రకటించి కూల్చివేశారు. అడ్డుకునేందుకు స్థానికులు విశ్వప్రయత్నం చేశారు. అది చివరికి ఘర్షణకు, ఆపై హింసకు దారితీసింది.

ఆందోళనకారుల దాడిలో 50 మందికిపైగా పోలీసులు గాయపడ్డారు. పలువురు అధికారులు, మున్సిపల్ వర్కర్లు, జర్నలిస్టులు ఈ హింసలో చిక్కుకున్నారు. వికృతమూకలు అధికారులపై రాళ్లు రువ్వుతూ విధ్వంసం సృష్టించారు. అప్రమత్తమైన పోలీసులు టియర్ గ్యాస్ ప్రయోగించి ఆందోళనకారులను చెదరగొట్టే ప్రయత్నం చేశారు. ఆందోళనకారులు పోలీస్ స్టేషన్ బయట వాహనాలకు నిప్పు పెట్టడంతో హింస వికృతరూపం దాల్చింది. 20 ద్విచక్ర వాహనాలు, సెక్యూరిటీ బస్‌కు అల్లరిమూక నిప్పు పెట్టినట్టు పోలీసులు తెలిపారు.  

హింస నేపథ్యంలో హల్ద్వానీలో ముందు జాగ్రత్త చర్యగా కర్ఫ్యూ విధించారు. ప్రభావిత ప్రాంతాల్లో దుకాణాలు, స్కూళ్లు మూసివేయించారు. పరిస్థితి ఇంకా ఉద్రిక్తంగానే ఉంది. క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు.


More Telugu News