వారానికి రూ.120 కోట్లు సంపాదిస్తున్న చైనా మహిళ.. 3 సెకన్ల వీడియోలతో సంచలనం

  • వస్తు ఉత్పత్తులకు 3 సెకన్ల వీడియోతో రివ్యూలు ఇస్తున్న చైనా సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ జెంగ్ జియాంగ్
  • లైవ్ స్ట్రీమింగ్ ద్వారా వస్తువులకు రివ్యూలు.. ఆకర్షితులవుతున్న నెటిజన్లు
  • వారానికి 14 మిలియన్ డాలర్ల ఆదాయం పొందుతున్న జెంగ్ జియాంగ్
ఆన్‌లైన్ వీడియోల ద్వారా ప్రపంచవ్యాప్తంగా చాలామంది కంటెంట్ క్రియేటర్లు డబ్బు సంపాదిస్తున్నారు. యూట్యూబ్, ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్‌తో పాటు ఇతర సోషల్ మీడియా మాధ్యమాలను ప్రధాన ఆదాయ వనరులుగా ఉపయోగించుకుంటున్నారు. వ్యూస్, సబ్‌స్క్రైబర్లు లేదా ఫాలోవర్ల సంఖ్య ఆధారంగా ఆదాయాన్ని పొందుతున్నారు. కొందరైతే అనూహ్య రీతిలో ధనార్జన చేస్తూ ఆశ్చర్యపరుస్తున్నారు. చైనా సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ జెంగ్ జియాంగ్ జియాంగ్ అనే మహిళ కూడా ఈ కోవకే చెందుతుంది. ఆన్‌లైన్ వీడియోల ద్వారా ఆమె వారానికి సుమారు రూ.120 కోట్లు సంపాదిస్తోంది. కేవలం 3 సెకన్ల వీడియోలతో వస్తు ఉత్పత్తులకు ఆమె ఇస్తున్న రివ్యూలు కనక వర్షం కురిపిస్తోంది. పెద్ద మొత్తంలో డబ్బు సంపాదిస్తోంది. ఈ మేరకు ఆన్‌లైన్ ఉత్పత్తుల ప్రమోషన్‌లో ఆమె విప్లవాత్మకమైన మార్పులు తీసుకొచ్చింది. మెరుపు వేగంతో వస్తువులకు రివ్యూలు ఇస్తూ ఆకర్షిస్తోంది.

జెంగ్ జియాంగ్.. లైవ్ స్ట్రీమింగ్ ద్వారా ప్రొడక్టులకు రివ్యూలు ఇస్తున్న సమయంలో ఆమె సహాయకులు వస్తువులతో కూడిన కంటెయినర్‌ను అందజేస్తారు. అందులోని అన్ని వస్తువులను తీసుకొని జెంగ్ జియాంగ్ రివ్యూ ఇస్తుంది. మిల్లీసెకన్ల వ్యవధిలోనే జెంగ్ జియాంగ్ ఉత్పత్తులను కెమెరాకు చూపించి రివ్యూ ఇస్తుంది. వస్తువు ధరతో పాటు కీలకమైన వివరాలను వెల్లడిస్తుంది. ఇదంతా మూడు సెకన్ల వ్యవధిలోనే జరిగిపోతుంది. రాపిడ్-ఫైర్ విధానంలో జెంగ్ జియాంగ్ ఇస్తున్న రివ్యూలు వీక్షకులను ఆకట్టుకుంటున్నాయి. దీంతో నమ్మశక్యం కాని రీతిలో వారానికి 14 మిలియన్ డాలర్లు (సుమారు రూ.120 కోట్లు) సంపాదిస్తోంది. మరోవైపు ఆమె రివ్యూ ఇచ్చే ఉత్పత్తులకు మంచి అమ్మకాలు లభిస్తున్నాయట. కాగా టిక్‌టాక్ చైనా వెర్షన్ ‘డౌయిన్‌’లో జెంగ్ జియాంగ్‌కు ఏకంగా 5 మిలియన్లకు పైగా ఫాలోయర్స్ ఉన్నారు.


More Telugu News