భవిష్యత్తులో కనీసం 10 మంది కలెక్టర్లు ఇబ్బంది పడతారు: మచిలీపట్నం ఎంపీ బాలశౌరి

  • ఇటీవల వైసీపీకి గుడ్ బై చెప్పి జనసేనలో చేరిన ఎంపీ బాలశౌరి
  • ఏపీలో ఇసుక విధానం జగన్ దోపిడీ కోసమే అన్నట్టుగా ఉందని విమర్శలు
  • గత ప్రభుత్వ ఉచిత ఇసుక విధానాన్ని ఈ ప్రభుత్వం రద్దు చేసిందని వెల్లడి
  • ఇసుక విధానం ఓ పెద్ద కుంభకోణం అని వ్యాఖ్యలు
తీవ్ర అసంతృప్తితో వైసీపీని వీడిన మచిలీపట్నం ఎంపీ వల్లభనేని బాలశౌరి జనసేన పార్టీలో చేరిన సంగతి తెలిసిందే. తాజాగా, ఆయన ఏపీ ప్రభుత్వ ఇసుక విధానంపై విమర్శనాస్త్రాలు సంధించారు.

రాష్ట్రంలో ఇసుక విధానం జగన్ దోపిడీ కోసమే అన్నట్టుగా ఉందని విమర్శించారు. గత ప్రభుత్వ ఉచిత ఇసుక విధానాన్ని జగన్ ప్రభుత్వం రద్దు చేసిందని బాలశౌరి పేర్కొన్నారు. ఇసుక కృత్రిమ కొరత సృష్టించి కార్మికులకు పని లేకుండా చేశారని మండిపడ్డారు. కొన్ని జిల్లాల్లో వైసీపీ నేతల ఆధ్వర్యంలోనే ఇసుక తవ్వకాలు జరుగుతున్నాయని ఆరోపించారు. రాష్ట్రంలో అనుమతులు లేకుండా ఇసుక తవ్వకాలు చేపడుతున్నారని, కార్పొరేట్ సంస్థ ద్వారా వందల కోట్లు కాజేస్తున్నారని బాలశౌరి ధ్వజమెత్తారు. 

"ఇసుక అక్రమ తవ్వకాలకు కలెక్టర్లు ఎందుకు అనుమతిస్తున్నారు? భవిష్యత్తులో కనీసం 10 మంది కలెక్టర్లు ఇబ్బంది పడతారు. రాష్ట్రంలో ఇసుక తవ్వకాల అంశం చాలా పెద్ద కుంభకోణం. ఇసుకపై ఆదాయం అంతా రెండు మూడు కుటుంబాలకే చెందుతోంది. ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) తనిఖీలు చేస్తే సూత్రధారులు బయటపడతారు" అంటూ ఎంపీ బాలశౌరి స్పష్టం చేశారు. జగన్ ను ఓడించడానికి ప్రజలు  సిద్ధంగా ఉన్నారని తెలిపారు .


More Telugu News